మళ్లీ వాయిదా పడిన విశాల్ పెళ్లి, బర్త్ డే రోజు స్టార్ హీరో కీలక ప్రకటన ?
ఆగస్టు 29న జరగాల్సిన హీరో విశాల్, నటి సాయి ధన్సిక పెళ్లి వాయిదా పడింది. గతంలో కూడా పలు మార్లు విశాల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మరి విశాల్ పెళ్లి చేసుకునేది ఎప్పుడు ?

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్. స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ పెళ్లి వార్త ప్రతీసారి వైరల్ న్యూస్ అవుతూనే ఉంటుంది. 2016లో నటుల సంఘం భవన నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ఆ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు విశాల్.
అనేక సమస్యల కారణంగా ఆ భవనం పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. తాను చెప్పినట్లుగానే నటుల సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు విశాల్.
విశాల్ కు ప్రస్తుతం 47 ఏళ్ళు. నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, విశాల్ తను ప్రేమించి అమ్మాయి గురించి రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. హీరోయిన్ సాయి ధన్సికను ప్రేమిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు.
యోగిత సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరూ జంటగా పాల్గొని తమ ప్రేమ, పెళ్లి గురించి ప్రకటించారు. ఆగస్టు 29న తన పుట్టినరోజు సందర్భంగా తమ పెళ్లి జరుగుతుందని విశాల్ ప్రకటించారు. దీంతో విశాల్ - సాయి ధన్సిక జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రెడ్ ఫ్లవర్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు మీడియా ప్రతినిథులు. నటీనటుల సంఘ భవనం కోసం 9 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయా, ఇంకో 3 నెలలు ఆగలేనా, అప్పటికి నటుల సంఘం భవనం సిద్ధమవుతుంది అని ఆయన అన్నారు.
అంతే కాదు ఆగస్టు 29న నా పుట్టినరోజు సందర్భంగా శుభవార్త వస్తుంది, ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉన్నా, ఆ భవనంలో మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నా అని విశాల్ అన్నారు. దీన్ని బట్టి ఆగస్టు 29న తన పెళ్లి జరగదని విశాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఇక విశాల్ పెళ్లి మళ్లీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కావడానికి మరికొంత కాలం టైమ్ పట్టే అవకాశం ఉంది. దాంతో ఆగస్టు 29న పెళ్లి చేసుకోవాలి అనుకున్న విశాల్.. ఈసారి కూడా ఆ డేట్ ను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయితే అగస్ట్ 29 న మాత్రం తన పెళ్లిడేట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాదు అదే రోజు భవనం ఓపెనింగ్ కు సబంధించి కూడా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

