- Home
- Entertainment
- అప్పట్లో ఏదో పిచ్చి సినిమా అనుకున్నాం కానీ.. ఇంత అర్థం ఉందా.? జీవితాన్ని మార్చే మెసేజ్
అప్పట్లో ఏదో పిచ్చి సినిమా అనుకున్నాం కానీ.. ఇంత అర్థం ఉందా.? జీవితాన్ని మార్చే మెసేజ్
Upendra: కన్నడ దర్శకుడు, నటుడు ఉపేంద్ర తీసిన ఉపేంద్ర సినిమా అప్పట్లో పెద్ద చర్చకు తెర తీసింది. ఆ సమయంలో ఈ సినిమాను చూసిన చాలా మంది ఏదో పిచ్చి సినిమా అనుకున్నారు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సినిమాలో ఎంతో అర్థం దాగి ఉంది.

ఉపేంద్ర సాధారణ సినిమా కాదు..
ఉపేంద్ర సాధారణ కమర్షియల్ మూవీ కాదు. ఇది మనిషి జీవితాన్ని, అతని ఆశలను, అహంకారాన్ని, సంబంధాలను చాలా లోతుగా ప్రశ్నించే సైకాలజికల్ డ్రామా. అప్పట్లో ఈ సినిమా చూసినవారికి ఇది ఒక షాక్‌లా అనిపించింది. ఇప్పుడు చూస్తే మరింత గొప్పగా అర్థమయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో హీరో పేరు కూడా “నేను”. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ “నేను” అనే భావన ఉంటుంది. అదే అహంకారం, స్వార్థం, కోరికల మూలం. దర్శకుడు ఈ “నేను” అనే భావనను మూడు మహిళా పాత్రల ద్వారా జీవితంలోని మూడు ప్రధాన కోణాలతో కలిపి చూపించాడు.
సినిమాలో హీరో “నేను” తనకు నచ్చినట్టు జీవించే వ్యక్తి. అతడు సమాజంలోని కపటత్వాన్ని ద్వేషిస్తాడు. నిజం మాత్రమే మాట్లాడతాడు. కానీ అదే సమయంలో అతడు చాలా స్వార్థపరుడు కూడా. తన కోరికల కోసం ఎవరి భావాలను అయినా ఉపయోగించుకుంటాడు. అతడి జీవితంలో ముగ్గురు మహిళలు ఉంటారు:
* స్వాతి – బాధ్యతలకు ప్రతీక
* ఆరతి – అందం, ప్రేమ, ఆనందానికి ప్రతీక
* కీర్తి – డబ్బు, పేరు, గౌరవానికి ప్రతీక
ఈ ముగ్గురినీ ఒకేసారి పొందాలని హీరో ప్రయత్నిస్తాడు. అదే సమయంలో తన “నేను” అనే అహంకారాన్ని కూడా వదలడు. చివరికి ఆ అహంకారమే అతడిని నాశనం చేసే స్థితికి తీసుకెళ్తుంది. సినిమా చివర్లో హీరోకు ఒక గొప్ప నిజం అర్థమవుతుంది “నేను” అనే భావన ఉన్నంతకాలం మనిషికి ప్రశాంతత ఉండదు.

ముగ్గురు హీరోయిన్లు కాదు… మూడు జీవిత సత్యాలు
దర్శకుడు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలను సాధారణ ప్రేమ కథలా చూపించలేదు. ప్రతి పాత్ర వెనుక ఒక గొప్ప తాత్విక అర్థం ఉంది.
స్వాతి - బాధ్యతల రూపం. ప్రతి మనిషి జీవితంలో కుటుంబం, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బాధ్యతలు తప్పవు. మనిషి ఎంత పెద్దవాడైనా వాటి నుంచి పారిపోలేడు. ఆ భావనకు ప్రతిరూపమే స్వాతి పాత్ర. హీరో ఎప్పుడూ కీర్తి కోసం పరుగెత్తినా… చివరికి బాధ్యతలు అతడిని వెంబడిస్తూనే ఉంటాయి. సినిమాలో స్వాతి పలుమార్లు హీరోను కాపాడుతుంది. దాని అర్థం ఏమిటంటే.. మనిషిని చివరికి నిలబెట్టేది బాధ్యతలే.
ఆరతి – అందం, ప్రేమ, ఆనందానికి ప్రతీక:
ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ, అందం, శారీరక ఆకర్షణ, సంతోషం కావాలనుకుంటాడు. మనసుకు నచ్చిన వ్యక్తితో జీవించాలని కోరుకుంటాడు. ఆ భావనకు ప్రతిరూపమే ఆరతి. హీరో ఆమెను ప్రేమిస్తాడు కానీ నిజంగా గౌరవించడు. ఆమెను కూడా తన కోరికలలో భాగంగా మాత్రమే చూస్తాడు. దర్శకుడు చెప్పాలనుకున్నది ఏమిటంటే.. ఆనందం కోసం మాత్రమే జీవిస్తే అది చివరికి మనల్ని నాశనం చేస్తుంది.
కీర్తి – డబ్బు, పేరు, గౌరవానికి ప్రతీక
మనిషి జీవితంలో ఒక దశ వచ్చిన తర్వాత డబ్బు, పేరు, సమాజంలో గుర్తింపు కావాలనిపిస్తుంది. అందుకే హీరో కీర్తి కోసం పిచ్చిగా పరుగెడుతుంటాడు. కీర్తి పాత్ర ద్వారా దర్శకుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. పేరు ఎవరి సొత్తు కాదు, డబ్బు కోసం మనుషులు కీర్తిని వెంబడిస్తారు. సమాజంలో గుర్తింపు కోసం మనిషి తన అసలు స్వభావాన్ని కోల్పోతాడు. హీరో “ఒక్క రాత్రి అయినా ఆమెతో ఉండాలి” అని చెప్పే డైలాగ్ అసలు అర్థం.. ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక్కరోజైనా గొప్పవాడిగా గుర్తింపు పొందాలని కోరుకుంటాడు.
దర్శకుడు చెప్పిన అసలు సందేశం
ఈ సినిమా మొత్తం ఒక తాత్విక ప్రయాణం. దర్శకుడు ఉపేంద్ర చెప్పాలనుకున్న ప్రధాన విషయం. “మనిషి సమస్యలన్నింటికీ మూలం ‘నేను’ అనే భావనే.” మనిషి జీవితంలో బాధ్యతలు కావాలి, ప్రేమ కావాలి, డబ్బు, పేరు కావాలి కానీ ఇవన్నీ తన స్వార్థం కోసం మాత్రమే కావాలనుకుంటే… అక్కడే సమస్యలు మొదలవుతాయి. హీరో మొదట తనకిష్టమొచ్చినట్టు జీవిస్తాడు, అందరినీ ఉపయోగించుకుంటాడు, తన కోరికలే ముఖ్యం అనుకుంటాడు. కానీ చివరికి ప్రేమలో శాంతి లేదని, డబ్బులో సంతోషం లేదని, అహంకారంలో జీవితం లేదని అతడికి అర్థమవుతుంది. అందుకే చివర్లో తన ముఖం ఉన్న షర్ట్‌ను చింపేసి “నేను” అనే అహంకారాన్ని చంపేస్తాడు. అది ఒక సాధారణ సీన్ కాదు… మనిషి ఆత్మజ్ఞానం పొందిన క్షణం.
మాస్లో సిద్ధాంతాన్ని సినిమాలో ఎలా చూపించాడు?
ఈ సినిమా వెనుక మాస్లో (Maslow) చెప్పిన హిరాచీ ఆఫ్ నీడ్స్ సిద్ధాంతం ఉంది. మనిషి జీవితంలో అవసరాలు.. ప్రాథమిక అవసరాలు, ప్రేమ, సంబంధాలు, గౌరవం, గుర్తింపు, చివరికి ఆత్మజ్ఞానంలా మారుతాయి. ఈ మొత్తం ప్రయాణాన్ని దర్శకుడు ఒక కమర్షియల్ సినిమాలో అద్భుతంగా చూపించాడు. హీరో మొదట ఆనందం వెతుకుతాడు, తర్వాత ప్రేమ, ఆ తర్వాత డబ్బు, కీర్తి చివరికి తనను తాను తెలుసుకుంటాడు. ఇది ఒక మనిషి అంతర్ముఖ ప్రయాణం.

