- Home
- Entertainment
- సావిత్రికి కూడా సాధ్యం కాని రికార్డ్ సరోజాదేవి సొంతం, వరుసగా 161 చిత్రాలలో..ఆ విషాదం తర్వాత సినిమాలకు దూరం
సావిత్రికి కూడా సాధ్యం కాని రికార్డ్ సరోజాదేవి సొంతం, వరుసగా 161 చిత్రాలలో..ఆ విషాదం తర్వాత సినిమాలకు దూరం
దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన నటీమణుల్లో బి సరోజా దేవి ఒకరు. బి సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె సోమవారం రోజు జూలై 14న బెంగుళూరు లోని తన నివాసంలో మరణించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన నటి
దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన నటీమణుల్లో బి సరోజా దేవి ఒకరు. బి సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె సోమవారం రోజు జూలై 14న బెంగుళూరు లోని తన నివాసంలో మరణించారు. ఈ అలనాటి తార మరణ వార్త సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆదివారం రోజు కోటా శ్రీనివాసరావు మరణించారు. కాగా సోమవారం రోజు చిత్ర పరిశ్రమకు సరోజా దేవి మృతితో మరో షాక్ తగిలింది.
ఎన్టీఆర్ చిత్రంతో టాలీవుడ్ లోకి సరోజా దేవి ఎంట్రీ
సినీ రాజకీయ ప్రముఖులు సరోజా దేవి చిత్రపరిశ్రమకు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో సరోజా దేవి సినీ కెరీర్ విశేషాలు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 1955లో సరోజ దేవి కన్నడలో మహాకవి కాళిదాస చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత 1957లో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం పాండురంగ మహత్యం. ఈ మూవీలో ఆమె ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన సొంత నిర్మాణంలో రూపొందించారు. తన తొలి చిత్రమే ఎన్టీఆర్ తో.. పైగా ఆయనే నిర్మాత కావడంతో తనకి చాలా భయం వేసిందని బి సరోజా దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ గారు తనని బాగా ప్రోత్సహించినట్లు గుర్తు చేసుకున్నారు.
సావిత్రికి కూడా సాధ్యం కానీ రికార్డ్ సరోజా దేవి సొంతం
తొలి చిత్రం తర్వాత సరోజా దేవి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. పాండురంగ మహత్యం కంటే ముందుగా సరోజా దేవికి ఏఎన్ఆర్ సరసన పెళ్లి సందడి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ పెళ్లి సందడి కంటే ముందుగా పాండురంగ మహత్యం విడుదలైంది. ఆ తర్వాత భూకైలాస్, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ప్రమీలార్జునీయం, అమరశిల్పి జక్కన్న లాంటి చిత్రాలు సరోజా దేవి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి.
ఇండియన్ సినిమాలో సావిత్రి అగ్ర హీరోయిన్లకు కూడా సాధ్యం కాని ఒక రికార్డ్ ని బి సరోజా దేవి సొంతం చేసుకున్నారు. అదేంటంటే 1955 నుంచి 1984 వరకు వరుసగా 161 చిత్రాల్లో ఆమె లీడ్ రోల్స్ లో నటించారు. ఆ టైంలో ఆమె ఏ చిత్రంలోనూ సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. ఈ ఘనత సరోజా దేవికి మాత్రమే సాధ్యం అయింది.
భర్త మరణంతో కోలుకోలేని దెబ్బ
1986 వరకు ఆమె కెరీర్ తిరుగులేని విధంగా సాగింది. కానీ 1986లో సరోజా దేవికి కోలుకోలేని విషాదం ఎదురైంది. ఆ ఏడాది ఆమె భర్త శ్రీహర్ష అనారోగ్యం కారణంగా మరణించారు. 1967లో వీరిద్దరికీ వివాహం జరిగింది. భర్త మరణించే టైంలో ఆమె లేడీస్ హాస్టల్ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తన భర్త మరణించిన తర్వాత సరోజా దేవికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి తగ్గిపోయింది.
ఏడాది పాటు ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు. ఇంటి నుంచి బయటకు రాలేదు. 1987 నుంచి సరోజా దేవి తిరిగి షూటింగ్స్ లో పాల్గొనడం ప్రారంభించారు. అది కూడా తన భర్త మరణించడానికి ముందు సైన్ చేసి ఉన్న చిత్రాలని పూర్తి చేయడానికి మాత్రమే. భర్త మరణం తర్వాత సరోజ దేవి సినిమాలకు దాదాపుగా దూరమయ్యారు.
సరోజా దేవి జీవితంలో మరో విషాదం
ఎన్టీఆర్ పాండురంగ మహత్యం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బి సరోజా దేవి.. ఎన్టీఆర్ తోనే తన చివరి తెలుగు చిత్రంలో నటించడం విశేషం. 1992లో సామ్రాట్ అశోక చిత్రంలో ఆమె చివరగా ఎన్టీఆర్ తో నటించారు. అంతకుముందు ఎన్టీఆర్ తో దానవీరశూరకర్ణ లాంటి అద్భుతమైన చిత్రంలో సరోజా దేవి నటించి మెప్పించారు. ఆ విధంగా ఎన్టీఆర్, సరోజా దేవి కాంబినేషన్ వెండితెరపై సూపర్ హిట్ గా నిలిచింది.
సరోజ దేవి జీవితంలో మరో విషాదం కూడా జరిగింది. ఆమె దత్తత తీసుకుని పెంచుకుంటున్న తన కుమార్తె భువనేశ్వరి చిన్న వయసులోనే మరణించారు. నటిగా వెలుగు వెలిగిన బి సరోజా దేవిని పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా వరించాయి.