జీవితంలో కచ్చితంగా సక్సెస్ కావాలని రూల్ ఏం లేదు బాసూ.. పూరీ చెప్పిన జీవిత సత్యం
Puri Musings: సినిమాల్లోనే కాదు, జీవితంపై కూడా తనదైన కోణంలో ఆలోచించే వ్యక్తి దర్శకుడు పూరీ జగన్నాథ్. తన పూరీ మూజింగ్స్‌లో ఆయన చెప్పిన “అన్‌సక్సెస్‌ఫుల్” అనే అంశం చాలా మందికి ఆలోచింపజేసేలా ఉంది. ఈ వీడియో చూస్తే మీ ఆలోచన మారడం ఖాయం.

సక్సెస్ ఒక నియమం కాదు…
మన సమాజంలో ఒక భావన బలంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ సక్సెస్ఫుల్ గానే ఉండాలి. కానీ పూరీ మాత్రం ఆ ఆలోచనను పూర్తిగా తిరస్కరిస్తాడు. “అన్సక్సెస్ఫుల్ గా కూడా హాయిగా బతకొచ్చు” అన్న ఆయన మాటలో ఒక పెద్ద నిజం ఉంది. జీవితం అనేది ఒక పరీక్ష కాదు… ప్రతి దశలో ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నెమ్మదిగా నడవడం కూడా జీవితం భాగమే.
పెద్ద ఇల్లు, ఖరీదైన కారు… ఇవేనా సక్సెస్?
మనకు చిన్నప్పటి నుంచే ఒక ఫార్ములా చెబుతారు. పెద్ద ఉద్యోగం, మంచి జీతం, కారు, ఇల్లు ఉంటేనే సక్సెస్. కానీ పూరీ చెప్పేది వేరే. ఇవన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేక ఏడుస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అంటే సక్సెస్ అనేది బయట కనిపించే వస్తువుల్లో కాదు… మనలో ఉండే ప్రశాంతతలో ఉంది.
ఫెయిల్యూర్ అంటే అంతేనా? విలువలేని వాళ్లమా?
మనకు అనుకున్నది జరగకపోతే మనం ఫెయిల్యూర్ అనిపించుకుంటాం. అదే పెద్ద తప్పు అని పూరీ చెబుతాడు. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం సహజం. గమ్యం చేరుకోకపోవచ్చు. కానీ అందుకే మనం పనికిరాని వాళ్లమవ్వం. మన విలువను మన ఫలితాలతో కొలవకూడదు. అందుకే ఆయన చారిత్రక ఉదాహరణలు చెబుతాడు నికోలా టెస్లా, ఫ్రాంజ్ కాఫ్కా వంటి వారు తమ కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ ఈరోజు వారి విలువ ఎంత గొప్పదో అందరికీ తెలుసు.
గుర్తింపు లేకుండా గొప్ప పనులు చేసే వాళ్లు
పూరీ చెప్పిన మరో ముఖ్యమైన విషయం.. మన చుట్టూ ఉన్న సాధారణ మనుషులు. ఒక చేపలు పట్టేవాడు ఎంతో మందికి ఆహారం ఇస్తాడు. ఒక టీచర్ ఎందరో పిల్లల జీవితాలను మార్చేస్తాడు. ఒక తోటమాలి మొక్కలకు నీళ్లు పోసి వాటిని వృక్షాలుగా పెంచుతాడు. ఇవాళ సమాజం దృష్టిలో వీరు “సక్సెస్ఫుల్” కాకపోవచ్చు. కానీ వీరి పని విలువ మాత్రం ఎంతో గొప్పది. ముఖ్యంగా… వీరు ప్రశాంతంగా నిద్రపోగలరు. అది ఒక బిలియనీర్ కంటే కూడా పెద్ద సక్సెస్ కావచ్చు.
మీ సక్సెస్ మీరే నిర్వచించుకోండి
ప్రపంచం ఎక్కువగా సక్సెస్ స్టోరీలను మాత్రమే సెలబ్రేట్ చేస్తుంది. అందులో మన కథ లేకపోతే మనం వెనుకబడ్డామనిపిస్తుంది. కానీ పూరీ చెబుతున్న అసలు విషయం ఇదే.. “మీ జీవితాన్ని డబ్బు, ఫేమ్, పవర్ తో కొలవకండి.” మీకు హాయిగా అనిపించే జీవితం… మీకు నచ్చిన పని… మీరు ప్రశాంతంగా నిద్రపోయే స్థితి — అదే మీ సక్సెస్ అని చెప్తాడు పూరీ.

