- Home
- Entertainment
- ఎన్టీఆర్ తర్వాత నేనే అంటూ స్టార్ హీరో కామెంట్స్.. ఒకేసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నార్, చిరంజీవి
ఎన్టీఆర్ తర్వాత నేనే అంటూ స్టార్ హీరో కామెంట్స్.. ఒకేసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నార్, చిరంజీవి
మోహన్ బాబు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ డబ్బా కొట్టనని వాస్తవాలు చెబుతానని మోహన్ బాబు అన్నారు.

సీనియర్ నటుడు మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో డైలాగ్ కింగ్ గా గుర్తింపు పొందారు. లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన్ని సన్మానించేందుకు టాలీవుడ్ ఏర్పాటు చేసిన సన్మాన సభ అది. ఆ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు అంతా హాజరయ్యారు.
వేదికపై మోహన్ బాబు మాట్లాడుతూ నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ డబ్బా కొట్టనని వాస్తవాలు చెబుతానని మోహన్ బాబు అన్నారు. నా కెరీర్ బిగినింగ్ లో నాగేశ్వరరావు గారి మరపురాని మనిషి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. తాతినేని రామారావు ఆ చిత్రానికి దర్శకుడు.
ఆ మూవీలో ఏఎన్ఆర్ తో ఫైట్ సన్నివేశంలో ఒక చిన్న వేషం ఉందని తనని వేయమని దర్శకుడు అడిగారు. ఆ టైంలో నాకు ఫైట్లు రావు. ఎన్ని టేకులు తీసుకున్నా నాకు సరిగ్గా నటించడం చేతకావడం లేదు. దీంతో ఏఎన్ఆర్ గారు నన్ను ఆ చిత్రం నుంచి తీసేశారు. ఆ టైంలో నేను ఒంటరిగా కూర్చుని ఎప్పటికైనా ఏఎన్ఆర్ ని మించే నటుడిని కావాలని, ఆయనతో కలిసి నటించాలని గట్టిగా కోరుకున్నా అని మోహన్ బాబు తెలిపారు.
క్రమశిక్షణతో, పట్టుదలతో అనుకున్నది సాధించాను. వాళ్ల బ్యానర్ లోనే ఏఎన్ఆర్ తో విలన్ గా, కమెడియన్ గా ఆయన పక్కన నటించాను. ప్రేమాభిషేకం చిత్రంలో కూడా ఒక పాత్ర చేశాను అని మోహన్ బాబు అన్నారు. చాలా సినిమాల్లో ఆయన్ని మించేలా నటించడానికి ప్రయత్నించా. ఆయన కంటే నేనే గొప్ప నటుడిని అని అనిపించుకున్నాను. ఈ విషయం నేను చెప్పింది కాదు ఏఎన్ఆర్ గారి సతీమణి అన్నపూర్ణమ్మగారే చెప్పారు అని మోహన్ బాబు సరదాగా కామెంట్స్ చేశారు.
అన్నపూర్ణమ్మ గారు మహాతల్లి. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ప్రేమాభిషేకం చిత్రంలో నటిస్తున్న సమయంలో వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. ఆమె నన్ను ఆశీర్వదించి.. ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా డైలాగులు చెప్పే నటుడివి నువ్వేనయ్యా అని ప్రశంసించినట్లు మోహన్ బాబు తెలిపారు.
మోహన్ బాబు వ్యాఖ్యలకు వేదికపై ఉన్న అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. మోహన్ బాబు నాకంటే గొప్ప నటుడని, నాకంటే బాగా డైలాగులు చెబుతానని అంటున్నారు. పైగా సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా చనిపోయిన నా భార్య పేరు చెబుతున్నారు. దీనికి నా సమాధానం ఒక్కటే.. ఆయన్ని అలాగే అనుకోనివ్వండి.. నాకేమీ ఇబ్బంది లేదు అని అన్నారు. దీంతో వెంటనే మోహన్ బాబు లేచి వచ్చి ఏఎన్ఆర్ పాదాలకు నమస్కరించారు.
పక్కనే ఉన్న చిరంజీవి మైక్ తీసుకుని మోహన్ బాబుకి కౌంటర్ ఇచ్చారు. అన్నపూర్ణమ్మ గారు పొగిడినప్పుడు.. ఆమె ప్రశంసలని ఒక తల్లి బిడ్డకు ఇచ్చిన ఆశీర్వాదంగా భావించాలి. అంతేకానీ నిజంగా ఆయన్ని మించేలా నటించావని చెప్పినట్లు కాదు. ఆమె మాటలని ఒక ఆశీర్వాదంగా మాత్రమే తీసుకోవాలని చిరంజీవి అన్నారు.