- Home
- Entertainment
- సమరసింహారెడ్డి రికార్డులు బ్రేక్ చేయాలని విలన్ గా నటించిన బాలయ్యకి ఊహించని షాక్.. నిర్మాతగా భారీ నష్టాలు
సమరసింహారెడ్డి రికార్డులు బ్రేక్ చేయాలని విలన్ గా నటించిన బాలయ్యకి ఊహించని షాక్.. నిర్మాతగా భారీ నష్టాలు
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన మాస్ విధ్వంసం అంతా ఇంతా కాదు.

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన మాస్ విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమాలపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సమరసింహారెడ్డి చిత్రం తర్వాత తాను చేయబోయే మూవీ తప్పనిసరిగా అంతకుమించేలా ఉండాలని బాలయ్య నిర్ణయించుకున్నారు.
దీని కోసం బాలయ్య డ్యూయల్ రోల్ ఉండే కథని ఎంచుకున్నారు. ఆ చిత్రమే సుల్తాన్. శరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1999లో విడుదలయింది. బాలకృష్ణ ఈ చిత్రంలో హీరోగా, విలన్ గా డ్యూయెల్ రోల్ లో నటించారు. బాలకృష్ణ ఎంతో ఇష్టపడి స్వయంగా నిర్మాతగా మారి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రానికి బాలయ్య నిర్మాణ భాగస్వామిగా ఉంటూ, సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. ఎం వి ఆర్ ప్రసాద్ ఈ చిత్రానికి మరో నిర్మాత.
ఈ మూవీ విషయంలో బాలయ్య ఖర్చుకి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లి చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. బాలకృష్ణ ఇటు పాజిటివ్ అటు నెగిటివ్ రోల్స్ లో నట విశ్వరూపం ప్రదర్శించారు. కానీ బాలయ్య నెగిటివ్ రోల్ లో నటించడం, చివర్లో కృష్ణంరాజు పాత్ర చనిపోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు.
దీంతోపాటు సమరసింహారెడ్డి చిత్రంతో పెరిగిపోయిన అంచనాల కారణంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నిరాశపరచింది. నిర్మాతగా బాలయ్యకి ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది.
ఆ విధంగా బాలయ్య తన సమరసింహారెడ్డి చిత్ర రికార్డులను బ్రేక్ చేద్దామని అనుకుంటే సుల్తాన్ మూవీ ఫలితం మరోలా వచ్చింది. ఈ చిత్రంలో రోజా, రచన, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు.