ఎంపీగా కమల్ హాసన్ జీతం ఎంత, ప్రభుత్వం అందించే సౌకర్యాలు ఏంటో తెలుసా?
ఎంపీగా రాజ్యసభలో ప్రమాణం చేశారు కమల్ హాసన్. రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ కు జీతం ఎంత ఇస్తారు. ప్రభుత్వం నుంచి అతనికి అందించే సౌకర్యాలు ఏంటో తెలుసుకుందాం?

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. డీఎంకే మద్దతుతో నామినేట్ అయిన కమల్, తమిళంలో ప్రమాణం చేయడం ద్వారా తన భాషా ప్రేమను చాటారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్‌కు భారత ప్రభుత్వం అందించే జీతంతో పాటు ఇతర ప్రయోజనాల ఏంటో చూద్దాం.
కమల్ జీతం & అలవెన్సులు:
నివేదికల ప్రకారం రాజ్యసభ ఎంపీకి నెలవారీ జీతం: 1,24,000 దీనితో పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లో డైలీ అలవెన్స్ కింద 2,500 అందిస్తారు. ఎంపీగా కార్యాలయం ఖర్చుల కోసం నెలకు 75,000 ఇస్తారు. ఇందులో సిబ్బందికి 50,000, స్టేషనరీ, ఇతర అవసరాలకు 25,000 అందించబడతాయి. మొత్తం కలిపి నెలకు జీతం + ఖర్చులు సుమారుగా 2,81,000 ఎంపీకి వస్తాయి.
ఎంపీకి ఉచిత ప్రయాణ వసతులు:
ఎంపీగా ఉన్నంత కాలం సంవత్సరానికి 34 దేశీయ విమాన ప్రయాణాలు ఫ్రీగా చేయవచ్చు. ఎంపీతో పాటు తనకు, కుటుంబానికి, సిబ్బందికి కలిపి 8 మంది ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ఈ ప్రయాణాలలో అపరిమిత ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం అందించబడుతుంది. రోడ్ మైలేజ్ అలవెన్స్ కూడా లభిస్తుంది
ఎంపీగా ఉన్నంత కాలం నివాస వసతి:
న్యూఢిల్లీలో రెంట్ ఇల్లు లేదా అధికారిక నివాసం అందించబడుతుంది. ఆ ఇంటికి కావలసిన విద్యుత్, నీటి, ఇతర వసతులు ఉచితంగా అందిస్తారు. సంవత్సరానికి 50,000 యూనిట్ల విద్యుత్, 4,000 లీటర్ల నీరు ఉచితంగా అందించబడుతుంది.
కమ్యూనికేషన్ , వైద్య ప్రయోజనాలు:
రాజ్యసభ సభ్యుడికి ఉచిత ఫోన్ తో పాటు ఇంటర్నెట్ వసతులు కూడా కల్పిస్తారు. ల్యాప్‌టాప్, మొబైల్ గాడ్జెట్లు తో పాటు ఆఫీస్ కు కావలసిన ఇతర వసలులు కూడా ఇందులో ఉంటాయి. ఇక వైద్య సేవల విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారులకు లభించే వైద్య సంరక్షణ సేవలు ఎంపీకి కూడా వర్తిస్తాయి.
పదవీ విరమణ తర్వాత:
పదవీ విరమణ తరువాత రాజ్యసభ మాజీ సభ్యునికి నెలకు 31,000 పెన్షన్ వస్తుంది. ఐదు సంవత్సరాలకు పైగా సేవ చేసిన ప్రతి సంవత్సరం అదనంగా 2,500 అందిస్తారు. రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ 6 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. లోక్‌సభ లాంటిది కాదు, ఇది శాశ్వత సంస్థ. నటుడిగా గత 60 ఏళ్లుగా స్టార్ డమ్ చూసిన కమల్ హాసన్, రాజ్యసభ సభ్యుడిగా రాజ్యాంగబద్ధ పదవిలో సేవలు అందించబోతున్నారు. మరి ఆయన పార్లమెంటరీ జీవితం ఎలా సాగుతుందో చూడాలి.