కమల్ హాసన్, రజనీకాంత్ స్నేహానికి 50 ఏళ్లు, తలైవా కు సర్ ప్రైజ్ ఇచ్చిన లోకనాయకుడు
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న రజినీకాంత్ ఇంటికి కమల్ హాసన్ సడెన్ గా వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయనతో దిగిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు కమల్.

నటులు కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. అపూర్వ రాగంగళ్ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వీరి స్నేహానికి 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో కలిసి నటించడం ఆపేసినా, వీరి స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇద్దరి వయసు 70 దాటింది. అయినా, ఇప్పటికీ రజినీ, కమల్ ఇద్దరూ కోలీవుడ్‌లో స్టార్స్ గానే కొనసాగుతున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమల్, మక్కల్ నీది మయ్యం అనే పార్టీకి అధ్యక్షుడిగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత, కమల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు కమల్ హాసన్.
ఇక ఎంపీగా ఎన్నికైన సందర్భంగా తన స్నేహితుడు రజినీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు కమల్. పోయెస్ గార్డెన్ లోని రజినీకాంత్ ఇంటికి ఆయన వెళ్లారు. కమల్ ను సాధరంగా ఆహ్వానించిన రజినీ పూల బొకే, హగ్ చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు కూలి, జైలర్ 2. కూలి సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జైలర్ 2 షూటింగ్ జరుగుతోంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఈ రెండు సినిమాలనూ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈసినిమాలకు సంగీతం అందిస్తున్నారు.
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 3, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ 2, అలాగే మరొక సినిమాలో ఆయన నటిస్తూ బిజీగా ఉన్నారు.

