4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. మరో సినిమా చేస్తే డబుల్ హ్యాట్రిక్ ఆయన సొంతం. ఇక బాలకృష్ణ కెరీర్ లో ఏకంగా మూడేళ్లు ఆడిన సినిమా ఏదో తెలుసా?

65ఏళ్ల వయసులో దూసుకుపోతున్న బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అరుదైన రికార్డులతో ఆటాడుకుంటున్నాడు. అఖండ నుంచి వరుసగా ఐదు సినిమాలతో విజయయాత్ర కొనసాగిస్తున్నాడు బాలకృష్ణ. 65 ఏళ్ల వయసులో.. డబుల్ హ్యాట్రిక్ హిట్ కు దగ్గరగా ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ2 సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా..మంచి విజయాన్ని అందించింది. వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు సాధిస్తూ, సినిమాల్లో.. రాజకీయాల్లో కూడా విజయపతాకం ఎగరేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ తో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
50 ఏళ్ల సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్న బాలకృష్ణ
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా స్టార్ డమ్ ను సాధించి.. కెరీర్ లో ఎన్నో జయాపజయాలు చూసిన బాలకృష్ణ.. రీసెంట్ గా 50 ఏళ్ల సినీ జీవితాన్నిపూర్తి చేసుకున్నాడు. బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, వంద రోజుల సినిమాలు, వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలను అందించారు. ఇప్పటివరకు ఆయన 110 సినిమాల్లో నటించగా, అందులో దాదాపు 70 సినిమాలకు పైగా వంద రోజులకు పైగా థియేటర్ లో ఆడి రికార్డ్ సాధించాయి. ఇది ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్‌కు, ప్రేక్షకాభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
3 ఏళ్లు నడిచిన బాలకృష్ణ సినిమా..?
గతంలో ఒక సినిమా 100 రోజులు ఆడితేనే గొప్ప విజయంగా భావించేవారు. అదే 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు పొందేది. ప్రస్తుతం పరిస్థితులు మారి, కొన్ని వారాల్లోనే భారీ వసూళ్లు సాధించే సినిమాలను పాన్ ఇండియా హిట్లుగా పేర్కొంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా వంద రోజులు ప్రదర్శితమయ్యే సినిమా అంటే అది రికార్డుగా చెప్పుకోవాల్సిందే. అలాంటి రికార్డును నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన నటించిన ఒక సినిమా ఏకంగా 3 ఏళ్లకు పైగా ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
4 ఆటలతో ఏకంగా 1000 రోజులు
బాలయ్య కెరీర్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక సినిమా ఏదో కాదు లెజెండ్. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా బాలకృష్ణకు బ్లాక్‌బస్టర్ హిట్ ను అందించడంతో పాటు సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో రోజుకు 4 ఆటలతో ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శించబడింది.
జగపతిబాబుకు సెకండ్ లైఫ్..
‘లెజెండ్’ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, జగపతిబాబు పవర్ ఫుల్ విలన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈసినిమా నుంచి జగపతి బాబుకు మళ్లీ అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. కెరీర్ మళ్లీ ఊపందుకుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు వారాహి చలన చిత్ర బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 2014 మార్చి 8న విడుదలైన ఈ సినిమా న తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.బాలకృష్ణ సినీ ప్రస్థానంలో 1000 రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘లెజెండ్’ నిలవడం, ఆయన కెరీర్‌లోని అత్యంత అరుదైన రికార్డుగా నిలిచిపోయింది.

