సమంత రెండో పెళ్లిపై జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.?
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సమంత, రాజ్ నిడిమోరు వివాహంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత లేదా రాజ్ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. నాగచైతన్య-శోభిత విషయంలో కూడా తనను విమర్శించిన వారు ఇప్పుడు సమంత గురించి..

వివాదాలకు కేరాఫ్..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదాలకు కేరాఫ్‌గా మారారు. గతంలో అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులపై ఆయన చేసిన కామెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఆయన చెప్పిన మాట నిజం కావడంతో కొందరు ఆయనకు మహిమలు ఉన్నాయని అభిప్రాయపడగా, జగన్ విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. రాజకీయాలకు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం యూట్యూబ్‌లో జాతకాలు చెప్పడంపై దృష్టి సారించారు.
వారి జాతక ఫలితాలపై కామెంట్స్..
సమంత, రాజ్ నిడిమోరు వివాహం నేపథ్యంలో వారి జాతక ఫలితాలను చెప్పాలని కొంతమంది అభిమానులు, నెటిజన్లు ఆయనకు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై వేణుస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేస్తూ స్పందించారు. గత ఏడాది నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం జరిగినప్పుడు ' ఏ హక్కుతో వారి జాతకాలు బయటపెట్టావని' తనను విమర్శించిన వారే ఇప్పుడు సమంత, రాజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఎందుకు అడుగుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
సమంత రెండో పెళ్లిపై ఈ ప్రశ్నలు..
సమంత, రాజ్ దాంపత్యంపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలను కూడా ఆయన తన వీడియోలో ప్రస్తావించారు. 'మగపిల్లాడు పుడతాడా.? ఆడపిల్ల పుడుతుందా.? ఇద్దరు కలిసి ఉంటారా.? విడిపోతారా.? మూఢమిలో పెళ్లి చేసుకున్న సమంత జీవితం ఎలా ఉంటుంది.?' వంటి ప్రశ్నలు కూడా తనను అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సమంత కానీ, రాజ్ కానీ తనను జాతకం చెప్పమని అడగలేదని వేణుస్వామి స్పష్టం చేశారు. మరి ఇతరులు ఎందుకు ఈ ఆసక్తి చూపుతున్నారు అంటూ ప్రజల ఆత్రుతను ఆయన ఎద్దేవా చేశారు.
సమంత నన్నేం అడగలేదు..
తాను ప్రస్తుతం ఒక పెద్ద సినిమా విజయం కోసం జరుగుతున్న పూజల్లో ఉన్నానని వేణుస్వామి వెల్లడించారు. మూడు రోజులుగా మేకర్స్ పూజలు చేయిస్తున్నారని, తాను అక్కడే ఉన్నానని తెలిపారు. మిగతా విషయాలన్నీ తనకు అనవసరం అని ఆయన పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి, చిన్నమస్తా దేవి అమ్మవారి ఆశీర్వాదంతో తాను ముందుకు సాగుతున్నానని వేణుస్వామి స్పష్టం చేశారు.
వేణుస్వామి వీడియో వైరల్..
వేణుస్వామి విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడిన తీరు, ప్రజల ఆసక్తిపై ప్రశ్నలు కురిపించిన తీరు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుండగా, మరికొందరు ఆయన స్పందనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

