- Home
- Entertainment
- 72 ఏళ్లు పూర్తి చేసుకున్న అక్కినేని దేవదాసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
72 ఏళ్లు పూర్తి చేసుకున్న అక్కినేని దేవదాసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
అక్కినేని నాగేశ్వరావు ఆల్ టైమ్ హిట్ దేవదాసు. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతం ఈసినిమా. దేవదాసు రిలీజ్ అయ్యి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది.

అక్కినేని దేవదాసుకు 72 ఏళ్లు
అక్కినేని నాగేశ్వరరావు నటించిన అపురూప ప్రేమకథ ‘దేవదాసు. ఈసినిమా 72 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1953 జూన్ 26న విడుదలైన ఈ క్లాసిక్ సినిమా భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబం నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో ఎన్నార్ నటనకు, కథలోని ఎమోషన్స్ ను గుర్తు చేస్తూ.. ఘన నివాళి అందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ వీడియో
ఈ వీడియో ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ ఏం తెలియ చేశారంటే? అక్కినేని నాగేశ్వరరావు అభినయించిన భగ్న ప్రేమికుడి పాత్ర, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని ముద్ర వేసింది. ఇది కేవలం సినిమా కాదు... ప్రేమ, కవిత్వం, బాధతో కూడిన జీవన గాధ,’’ అని ఎమోషనల్ కామెంట్స్ ఈ వీడియోలో వినిపించాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన వీడియోలో, "దేవదాసు ఒక భావోద్వేగం, అది మరచిపోలేని ప్రేమ కథ. అక్కినేనివారు సృష్టించిన భావోద్వేగ ప్రపంచాన్ని మళ్లీ ఒక్కసారి గుర్తుచేసుకునే ప్రయత్నం ఇది. ఈ చిత్రం తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించిన మైలురాయి," అని పేర్కొన్నారు.
దేవదాసు సినిమా విశేషాలు
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు(దేవద) పాత్రలో, సావిత్రి పార్వతి(పారు)గా, యస్.వి.రంగారావు జమీందార్ నారాయణ రావుగా కనిపించారు. ప్రతి పాత్రలో నటీనటులు జీవించారు. ఈసినిమా ఎంత ప్రభావం చూపించిందంటే.. ఎన్ని ప్రేమ కథలు వచ్చినా.. దేవదాసు,పార్వతి ప్రేమతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఇక ఈసినిమా షూటింగ్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు దర్శకుడు. 70 ఏళ్ల క్రితమే ఇలాంటి ఆలోచనలు చేశారు వేదాంతం రాఘవయ్య. ఎటువంటి సౌకర్యాలు లేని టైమ్ లోనే ఆయన ఈసినిమాను ఎక్కువగా రాత్రివేళలలో నిర్వహించారు.
అంతే కాదు రాత్రివేళ షూటింగ్ వల్ల.. అక్కినేనికి తగినంత నిద్రలేక, ఆయన్ని ఒక సహజగానే తాగుబోతులా చూపించగలిగారట దర్శకుడు. ఈ ప్రయోగం సినిమాలో పాత్రకు ఒక డిప్ రియాలిజాన్ని తీసుకువచ్చిందని సినీ చరిత్రకారులు పేర్కొంటున్నారు.
దేవదాసు పాటలకు ఇప్పటికీ తగ్గని డిమాండ్
దేవదాసు పాటలకు ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు. తెలుగు పాటల చరిత్రలో ఇవి ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. "అంతా భ్రాంతియేనా", "జగమే మాయ", "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయ్" లాంటి పాటలు ఇప్పటికీ చాలామంది ప్లేలిస్టుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ పాటల నేపథ్యం, సాహిత్యం, గాత్రం ప్రతి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.
అక్కినేని ఆల్ టైమ్ క్లాసిక్స్
అక్కినేని నాగేశ్వరరావు నటించిన పది ప్రముఖ క్లాసిక్ సినిమాల్లో దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మనం సినిమాలు ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంటాయి. ఇవన్నీ ఇప్పటికీ కొత్త తరం ప్రేక్షకులకు కూడా ప్రేరణనిచ్చే చిత్రాలుగా నిలిచాయి.
ఈ తరం ఆడియన్స్ చూడాల్సిన సినిమా
ఈ తరం ప్రేక్షకులు ఈ క్లాసిక్ చిత్రాన్ని చూడకపోతే తప్పక చూడాల్సిన అవసరం ఉంది. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక కాలాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక సంపద కూడా. అలాంటి సినిమాల్లో దేవదాసుకి ఉన్న స్థానం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

