శివకార్తికేయన్ అవకాశాన్ని ఆమిర్ ఖాన్ లాక్కున్నారా?
లాల్ సింగ్ చద్దా విఫలమైన తర్వాత నటన నుండి విరామం తీసుకోవాలనుకున్న ఆమిర్ ఖాన్, సితారే జమీన్ పర్ సినిమాకి నిర్మాతగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నారు. కాని చివరికి ఈసినిమాకు ఆయనే హీరోగా చేయాల్సి వచ్చింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ రీసెంట్ గా తన తాజా చిత్రం సితారే జమీన్ పర్ నటీనటుల ఎంపిక గురించి ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లాల్ సింగ్ చద్దా సినిమా ప్లాప్ అయిన తరువాత తాను భావోద్వేగానికి లోనై అలసిపోయానని, కొంతకాలం నటన నుండి విరామం తీసుకోవాలనుకుంటున్నానని ఆమిర్ ఖాన్ చెప్పారు.
అంతే కాదు తన తరువాతి సినిమాగా వచ్చిన సితారే జమీన్ పర్ చిత్రానికి నిర్మాతగా కొనసాగాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్నను సంప్రదించారు. ప్రసన్న మొదట నిరాశ చెందారు. కానీ ఆమిర్ ఖాన్ నిర్మాతగా కొనసాగుతానని చెప్పారు.
ఈ సినిమా మొదట ద్విభాషా చిత్రంగా, హిందీ, తమిళంలో నిర్మించాలని ఆమీర్ అనుకున్నారు. హిందీ వెర్షన్ కోసం ఫర్హాన్ అక్తర్‌తో, తమిళ వెర్షన్ కోసం శివకార్తికేయన్‌తో చర్చలు జరిపినట్టు ఆయన వెల్లడించారు.
చివరి స్క్రిప్ట్ చర్చల సమయంలో, ఆ పాత్రను తానే ఎందుకు పోషించకూడదనే బలమైన అంతర్గత భావన కలిగిందని ఆమిర్ ఒప్పుకున్నారు. దాదాపు ఒక వారం ఆలోచించిన తర్వాత, డైరెక్టర్ ప్రసన్నతో తన మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు. దాంతో ఆయన చాలా సంతోషించినట్టు ఆమిర్ అన్నారు.
ఆమిర్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న దర్శకుడు, ఆ పాత్రకు ఆయనే సరైన వ్యక్తి అనిఅన్నారు. ఫర్హాన్ , శివకార్తికేయన్‌లకు ఇంతకు ముందు ఇచ్చిన హామీల నుండి వెనక్కి తగ్గడంపై మొదట సందేహాలు ఉన్నప్పటికీ, చివరికి ఆమిర్ వారిని ఒప్పించగలిగారు.
సితారే జమీన్ పర్, 2018లో విడుదలైన స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ అధికారిక రీమేక్. ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది.