- Home
- Entertainment
- 2026 Pan India Movies: 2026లో బాక్సాఫీస్ మోత మోగించే భారీ చిత్రాలు ఇవే.. రెండేసి సినిమాలతో చిరంజీవి, ప్రభాస్
2026 Pan India Movies: 2026లో బాక్సాఫీస్ మోత మోగించే భారీ చిత్రాలు ఇవే.. రెండేసి సినిమాలతో చిరంజీవి, ప్రభాస్
2026 లో టాలీవుడ్ నుంచి కొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో ఏడాది మొత్తం సినీ ప్రియులకు పండగ గ్యారెంటీ. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ లతో పాటు ఇతర భాషల హీరోలు నటించిన సినిమాలు కూడా అలరించబోతున్నాయి.

2026లో రిలీజయ్యే భారీ బడ్జెట్ చిత్రాలు
కొత్త సంవత్సరం 2026లో పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల మోత మోగనుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా అగ్ర హీరోలు తమ సినిమాలతో సిద్ధం అవుతున్నారు. రాజాసాబ్ తో మొదలయ్యే పెద్ద సినిమాల హంగామా 2026 డిసెంబర్ లో విడుదలయ్యే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన వరకు కొనసాగనుంది. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ది రాజాసాబ్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. వరుస సీరియస్ చిత్రాలకు బ్రేక్ వేస్తూ ప్రభాస్ ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ చూపించబోతున్నాడు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న చిత్రం ఇది.
మన శంకర వరప్రసాద్ గారు
కామెడీ, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు అనిల్ రావిపూడి బ్రాండ్ గా మారిపోయారు. అనిల్ దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. వింటేజ్ మెగాస్టర్ ని అనిల్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ మూవీలో క్రేజీ హీరోయిన్ నయనతార నటిస్తోంది. ఈ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో గెస్ట్ రోల్ లో నటిస్తుండడం మరో హైలైట్.
పెద్ది
గేమ్ ఛేంజర్ సినిమాతో నిరాశ పడ్డ రాంచరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది రూపొందుతోంది. 350 కోట్ల బడ్జెట్ లో వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉత్తరాంధ్ర రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన చికిరి సాంగ్ దేశం మొత్తం ట్రెండింగ్ గా మారింది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే తారా స్థాయిలో అంచనాలు ఉన్న ఈ చిత్రం 2026 మార్చి 27న రిలీజ్ కానుంది.
ది ప్యారడైజ్
దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని రెండోసారి నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్. దసరాని మించేలా డబుల్ డోస్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాని విచిత్రమైన లుక్ తోనే ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఈ చిత్రం 2026 మార్చి 26న రిలీజ్ కానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలంగా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. 2026లో మార్చి లేదా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి హరీష్ శంకర్ కి ఆయన్ని ఎలా చూపించాలో బాగా తెలుసు. దీనితో పవన్ అభిమానులు ఉస్తాద్ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం
కెరీర్ బిగినింగ్ లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు త్రివిక్రమ్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ తో చేతులు కలిపారు. త్రివిక్రమ్ దర్శకుడిగా వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ తన స్టైల్ లో 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
విశ్వంభర
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ మూవీ 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ లాంటివి ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. మొత్తానికి ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఫౌజీ
రాజాసాబ్ తర్వాత ప్రభాస్ నుంచి మరో సినిమా ఫౌజీ 2026లోనే రిలీజ్ కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. బ్రిటిష్ టైం పీరియడ్ లో వార్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది.
ఎన్టీఆర్ నీల్ మూవీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం ఉండబోతోంది అని ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
రౌడీ జనార్ధన
ఈ ఏడాది విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 2026లో మరో భారీ ప్రయత్నంతో విజయ్ రాబోతున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇతర భాషా చిత్రాలు
తెలుగులో పాటు ఇతర భాషల నుంచి కూడా కొన్ని పాన్ ఇండియా చిత్రాలు 2026లో రిలీజ్ కానున్నాయి. వాటిలో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ పార్ట్ 1 2026 దీపావళికి రిలీజ్ కానుంది. రణబీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న చిత్రం ఇది. దళపతి విజయ్ జన నాయగన్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ కూడా 2026లోనే రిలీజ్ అవుతోంది. మార్చి 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ కి సీక్వెల్ ధురంధర్ 2 కూడా 2026 మార్చిలోనే రిలీజ్ కానుంది. మొత్తంగా 2026లో సంక్రాంతికి మొదలయ్యే పెద్ద సినిమాల సందడి డిసెంబర్ వరకు కొనసాగనుంది.

