- Home
- Sports
- Cricket
- Top 5 Wicket Takers In T20: టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
Top 5 Wicket Takers In T20: టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
Top 5 Wicket Takers In T20I: బ్యాటర్ల ఆధిపత్యం కనిపించే టీ20 క్రికెట్ లో పలువురు బౌలర్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 (T20I) లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 క్రికెట్ లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న బౌలర్లు
ధనాధన్ ఇన్నింగ్స్ లతో బ్యాటర్ల ఆధిపత్యం కనిపించే టీ20 క్రికెట్ లో సూపర్ బౌలింగ్ తో పలువురు బౌలర్లు పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. టీ20 అంతర్జాతీయ (T20I) క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అఫ్గానిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్, ప్రస్తుతం టాప్‌లో ఉన్న న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీకి దగ్గరగా వచ్చారు.
సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫార్మాట్ లో ప్రస్తుతం ఎక్కువ మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో బౌలర్లకు తమ ప్రతిభ ప్రదర్శించేందుకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో తమ జోరు చూపిస్తున్న టాప్ 5 బౌలర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
5. ముస్తఫిజుర్ రెహమాన్
బాంగ్లాదేశ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ 109 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు తీసి టాప్ 5లో ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. అతని బౌలింగ్ సగటు 21.33 కాగా, ఎకానమీ రేట్ 7.42గా ఉంది.
డెత్ ఓవర్లలో తన స్పెషలైజ్‌డ్ ఆఫ్‌కటర్లు, ఫాస్ట్ బౌలింగ్ వేరియంట్లతో బ్యాటర్లపై విరుచుకుపడతారు. చిన్న మార్పులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. ఈ సామర్థ్యాలే అతన్ని టీ20 ఫార్మాట్‌లో విలువైన బౌలర్‌గా ఉంచుతున్నాయి.
4. ఇష్ సోధీ
న్యూజిలాండ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 125 మ్యాచ్‌ల్లో 146 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని సగటు 23.06, ఎకానమీ 8.40గా ఉంది. అతని లూపీ లెగ్‌బ్రేక్‌లు, తెలివైన గూగ్లీలు బ్యాటర్లలో గందరగోళం సృష్టిస్తాయి.
అయితే అతని ఎకానమీ కొంచెం ఎక్కువైనా, కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం అతన్ని జట్టులో స్థిరంగా ఉండేలా చేస్తోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లలో కీవీస్ జట్టులో కీలక బౌలర్ గా మారాడు.
3. షకీబ్ అల్ హసన్
బాంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 అంతర్జాతీయ 126 ఇన్నింగ్స్‌ల్లో 149 వికెట్లు తీసి మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతని బౌలింగ్ సగటు 20.91 కాగా, ఎకానమీ 6.81గా ఉంది.
మిడిల్ ఓవర్లలో మంచి లైన్, మార్పులు చేస్తూ బంతులు వేయడంలో అతని నైపుణ్యం విశ్వసనీయమైన బౌలర్‌గా నిలబెట్టాయి. బాల్ తో పాటు బ్యాటుతో కూడిన అతని కంట్రిబ్యూషన్ జట్టుకు కీలకంగా ఉంటుంది. బంగ్లాదేశ్ అనేక విజయాల్లో బ్యాట్, బాల్ తో అతను రాణించాడు.
2. రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 96 ఇన్నింగ్స్‌ల్లోనే 161 వికెట్లు తీసి టిమ్ సౌథీ రికార్డుకు దగ్గరగా వచ్చాడు. అతని అద్భుతమైన బౌలింగ్ సగటు 13.80, ఎకానమీ 6.08గా ఉంది.
రషీద్ ఖాన్ సూపర్ గూగ్లీలు, వేగంలో మార్పులు చేస్తూ బంతులు వేయడం, ఏ పిచ్‌పై అయినా బాల్ ను టర్న్ చేయగల సామర్థ్యం ప్రపంచ వ్యాప్తంగా బ్యాటర్లను ఇబ్బందులు పెడుతుంది. ఇంకా 26 ఏళ్ల వయస్సులో ఉన్న రషీద్, త్వరలోనే టాప్ స్థానానికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఫామ్ చూస్తే అతను త్వరలోనే టాప్ లో నిలవనున్నాడు.
1. టిమ్ సౌథీ
ప్రస్తుతం టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ పేసర్ టిమ్ సౌథీ పేరిట ఉంది. 123 ఇన్నింగ్స్‌ల్లో 164 వికెట్లు తీసిన ఆయన సగటు 22.38, ఎకానమీ 8.10గా ఉంది.
స్వింగ్ బంతులు వేయడంలో దిట్ట, డెత్ ఓవర్లలో స్లోవర్ డెలివరీలతో బ్యాటనర్లు తెలివిగా పెవిలియన్ కు పంపగల సామర్థ్యం ఉన్న బౌలర్. స్పిన్నర్లు, మిస్టరీ బౌలర్లు పెరిగినా, అతని డిసిప్లిన్, ఆటపై ఉన్న అవగాహన వల్ల ఇప్పటికీ టిమ్ సౌథీ టాప్ లో కొనసాగుతున్నాడు.
అయితే, బౌలింగ్ రేసులో టిమ్ సౌథీకి కంటే ఎక్కువ ప్రభావాన్ని రషీద్ ఖాన్ చూపిస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ మ్యాచ్‌ల్లోనే ఎక్కువ వికెట్లతో దుమ్మురేపుతున్నాడు.
అతని బౌలింగ్ సగటు, స్ట్రైక్ రేటు మిగతా బౌలర్లతో పోలిస్తే అసాధారణంగా ఉన్నా, మిగిలిన టాప్ 5 బౌలర్లు కూడా టీ20 క్రికెట్‌ను ప్రభావితం చేసినవారే. రాబోయే రోజుల్లో ఈ జాబితా ఎలా మారుతుందో చూడాలి మరి !