Jasprit Bumrah: జోరూట్ కు దిమ్మదిరిగే షాక్.. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో సెంచరీ హీరో జో రూట్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ప్రపంచ రికార్డు సాధించాడు.

జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు.
రెండో రోజు ఉదయం బుమ్రా మూడు కీలక వికెట్లు తీయడంతో భారత్ పైచేయిగా సాధించింది. బుమ్రా ఈ మ్యాచ్‌లో జో రూట్‌ను ఔట్ చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు.
IND vs ENG: రెండో రోజు బుమ్రా ఫైర్
ఇంగ్లాండ్ 251-4 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించింది. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ ఏడు బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా స్పెల్‌కు ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు సమాధానం లేకుండా పోయింది.
మొదట బెన్ స్టోక్స్ (44)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. వెంటనే తర్వాతి ఓవర్‌లో జో రూట్‌ను అద్భుతమైన ఇన్-స్వింగర్‌తో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపించాడు. తొలి రోజున బుమ్రా హ్యారీ బ్రూక్ వికెట్‌ను కూడా సాధించాడు.
ప్రపంచ క్రికెట్ లో బుమ్రా అరుదైన రికార్డు
ఈ మ్యాచ్ లో మరోసారి బుమ్రా తన బౌలింగ్ లో జోరూట్ ను అవుట్ చేశాడు. బుమ్రా తన స్పెల్‌తో మ్యాచ్‌ను మార్చడమే కాకుండా, జో రూట్‌ను 15వ సారి ఔట్ చేయడం ద్వారా ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.
ఈ 15 ఔట్లలో 11 టెస్టుల్లో, 3 వన్డేల్లో, 1 టీ20లో వచ్చాయి. రెండవ స్థానంలో ఉన్న ప్యాట్ కమిన్స్ 14 సార్లు జో రూట్‌ను ఔట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్లు:
జస్ప్రీత్ బుమ్రా 15
ప్యాట్ కమిన్స్ 14
జోష్ హేజిల్‌వుడ్ 13
రవీంద్ర జడేజా 13
ట్రెంట్ బోల్ట్ 12
డీఆర్‌ఎస్‌తో శుభ్‌మన్ గిల్ శుభారంభం
బుమ్రా క్రిస్ వోక్స్‌ను ఔట్ చేయగలిగినా, ఆ నిర్ణయం పూర్తిగా డీఆర్‌ఎస్‌తో సాధ్యమైంది. వోక్స్ బ్యాట్‌కు బాల్ తాకిన విషయం స్పష్టంగా తెలియకపోయినా, శుభ్‌మన్ గిల్ తన ఇంట్యూషన్ ఆధారంగా రివ్యూ కోరాడు.
బుమ్రా తానేం అర్ధం కాలేదన్నట్లు అభిప్రాయపడగా, గిల్ మాత్రం "కచ్చితంగా బ్యాట్‌కు తాకింది" అన్న నమ్మకంతో రివ్యూ కోరాడు. అల్ట్రా-ఎడ్జ్‌లో ఫెయింట్ నిక్ కనిపించడంతో భారత జట్టు మరొక కీలక వికెట్ సాధించింది.
డబ్ల్యూటీసీ రికార్డుకు చేరువగా బుమ్రా
బుమ్రా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక ఐదు వికెట్ల ఘనతలను సాధించిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌తో సమానంగా ఉన్నాడు. ప్రస్తుతం అతనికి 11 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. మరో ఐదు వికెట్ల ఇన్నింగ్స్ వస్తే.. బుమ్రా WTC చరిత్రలో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు.
రాహుల్ క్యాచ్ మిస్ – ఇంగ్లాండ్‌కు ఛాన్స్
జస్ప్రీత్ బుమ్రా స్పెల్‌తో ఇంగ్లాండ్ ఇబ్బందులు పడుతూనే ఉంది. అలాగే, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మరో వికెట్ భారత్ కు దక్కే అవకాశం వచ్చింది. కానీ, జేమీ స్మిత్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. స్మిత్ అప్పటికి 5 పరుగుల వద్ద ఉండగా, తర్వాత అతను ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు నడిపించాడు.
గత మ్యాచ్‌ల్లో స్మిత్ 44*, 184*, 88 స్కోర్లు సాధించగా, భారత్‌కు అతను పెద్ద తలనొప్పిగా మారాడు. ప్రస్తుతం అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కార్స్ తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు.

