Team india: లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్న భారత బౌలర్లు
India vs England: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టుకు సై అంటున్నాయి. అయితే, ఈ గ్రౌండ్ లో భారత బౌలింగ్ రికార్డులు గమనిస్తే.. పలువురు బౌలర్లు ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లార్డ్స్ లో అదరగొట్టిన భారత బౌలర్లు
క్రికెట్ ప్రపంచంలో "హోమ్ ఆఫ్ క్రికెట్"గా పేరుగాంచిన లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఎంతో మంది లెజెండ్లు తమ ప్రతిభను చాటారు. 1884లో తొలి టెస్ట్ ఆతిథ్యమిచ్చినప్పటి నుంచి అనేక గొప్ప బౌలింగ్ ప్రదర్శనలకు ఇది వేదికగా నిలిచింది. భారత బౌలర్లు కూడా ఈ వేదికపై అద్భుత గణాంకాలతో చరిత్ర లిఖించారు. వారిలో కపిల్ దేవ్ నుంచి సిరాజ్ వరకు పలువురు స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
మహ్మద్ సిరాజ్: 8/126 vs ఇంగ్లాండ్, 2021
2021లో జరిగిన లార్డ్స్ టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దుమ్మురేపే ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టును చెడుగుడు ఆడుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాలుగేసి వికెట్లు తీసి, మొత్తం 8/126 గణాంకాలతో మ్యాచ్‌ను భారత్ వైపు తీసుకొచ్చాడు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.
ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో సిరాజ్ వేసిన స్పెల్ ఎప్పటికీ గుర్తుండిపోయే బౌలింగ్ గా నిలిచింది. ఇంగ్లాండ్ 272 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగింది. అయితే, సిరాజ్ 4/32 బౌలింగ్ గణాంకాలతో చెలరేగి ఇంగ్లాండ్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఆతిథ్య జట్టు కేవలం 120 పరుగులకే పరిమితం అయింది. ఐదో రోజు ఆఖరి సెషన్‌లో భారత్‌కు సిరాజ్ ఘన విజయాన్ని అందించాడు.
కపిల్ దేవ్: 8/168 vs ఇంగ్లాండ్, 1982
భారత క్రికెట్‌లో చెరగని ముద్రవేసిన ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 1982లో లార్డ్స్ టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మ్యాచ్ లో భారత జట్టు ఓడినప్పటికీ.. కపిల్ దేవ్ బౌలింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మొదటి ఇన్నింగ్స్‌లో తీసిన 5/125 వికెట్లు అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
ఇంగ్లాండ్ 433 పరుగులు చేసిన ఈ ఇన్నింగ్స్‌లో కపిల్ మిగతా బౌలర్లతో పోలిస్తే మంచి స్పెల్ వేశాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 128 పరుగులకే ఆలౌట్ కాగా, ఫాలో ఆన్‌లో 369 పరుగులతో పోరాటం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ మరో మూడు వికెట్లు తీసి (3/43), మ్యాచ్‌లో మొత్తంగా 8 వికెట్లు నమోదు చేశాడు. కానీ, భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఆర్‌పీ సింగ్: 7/117 vs ఇంగ్లాండ్, 2007
2007లో భారత్ చివరిసారిగా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన సమయంలో ఆర్‌పీ సింగ్ అద్బుతంగా రాణించాడు. లార్డ్స్ టెస్ట్‌లో అతను 7 వికెట్లు తీసి (2/58 + 5/59), మ్యాచ్‌ను డ్రాగా నిలిపాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన ఆర్‌పీ సింగ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఇంగ్లాండ్‌ను 282 పరుగులకు పరిమితం చేశాడు. ఈ ప్రదర్శనతో ఆర్‌పీ సింగ్ లార్డ్స్ హానర్స్ బోర్డు పై తన పేరు నమోదు చేసుకున్నాడు.
లార్డ్స్ పిచ్‌పై చర్చ: గిల్ కామెంట్స్ వైరల్
ఇటీవల బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో పిచ్‌పై ఇంగ్లాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఫ్లాట్ ట్రాక్’లో భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 1000కు పైగా పరుగులు చేసి, ఇంగ్లాండ్‌కు 608 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేధించడంలో ఇంగ్లాండ్ పూర్తిగా విఫలమైంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌లు పిచ్‌ను "ఉపఖండ తరహా పిచ్"గా అభివర్ణించారు. ఇది తమకు కాదు, భారత్‌కు అనుకూలమైందని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు మూడో టెస్టు లార్డ్స్ వేదికగా జరగనుంది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఇంగ్లాండ్ పై సంచలన ఇన్నింగ్స్ ను ఆడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. “ఇప్పుడు చూద్దాం లార్డ్స్‌లో ఎలాంటి పిచ్ ఇస్తారో.. ఇంత ఫ్లాట్ పిచ్ ఇస్తారని అనుకోవడం లేదు” అంటూ పేర్కొన్నారు.