Jamie Smith : 4 6 4 4 4.. దంచికొడుతున్న జేమీ స్మిత్.. తుపాను సెంచరీ
India vs England: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ లు బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. జేమీ స్మిత్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
India vs England: దూకుడు పెంచిన ఇంగ్లాండ్
India vs England: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. మూడో రోజు త్వరగానే మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే, జేమీ స్మిత్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ తన దూకుడును కొనసాగించింది. ఐదు వికెట్లు పడిపోయాని చూడకుండా హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ లు భారత బౌలింగ్ ను దంచికొడుతున్నారు. ఈ క్రమంలోనే లంచ్ బ్రేక్ కు ముందే స్మిత్ రికార్డు సెంచరీ కొట్టాడు.
Jamie Smith: 80 బంతుల్లోనే సెంచరీ కొట్టిన జేమీ స్మిత్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన జేమీ స్మిత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. టెస్టు క్రికెట్ ను టీ20 క్రికెట్ లా ఆడుతూ అదిరిపోయే షాట్స్ కొట్టాడు.
85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
కేవలం 80 బంతుల్లోనే జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102 పరుగుల ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ 249/5 (47 ఓవర్లు) పరుగులతో ఆడుతోంది. తన సెంచరీ ఇన్నింగ్స్ రికార్డుల మోత మోగించాడు జేమీ స్మిత్.
ఒకే ఓవర్ లో 23 పరుగులు రాబట్టిన జేమీ స్మిత్
ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్ లో జేమీ స్మిత్ వరుసగా ఐదు బౌండరీలు బాదాడు. 4 6 4 4 4 అద్భుతమైన షాట్స్ కొట్టాడు. జేమీ స్మిత్ బ్యాటింగ్ దెబ్బకు ప్రసిద్ధ్ కేవలం 6 ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్నాడు.
Jamie Smith with back-to-back boundaries to start the 38th over 🔥
He's absolutely flying here 😍 pic.twitter.com/rLEry94aGo— England Cricket (@englandcricket) July 4, 2025
ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్ టెస్టు సెంచరీలు బాదిన టాప్ ప్లేయర్లు ఎవరు?
ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా సెంచరీలు బాదిన టాప్-5 ప్లేయర్ల లిస్టులో జేమీ స్మిత్ కూడా చేరాడు.
1. గిల్బర్ట్ జెస్సప్ – 76 బంతుల్లో vs ఆస్ట్రేలియా, ది ఓవల్, 1902
2. జానీ బెయిర్‌స్టో – 77 బంతుల్లో vs న్యూజిలాండ్, ట్రెంట్ బ్రిడ్జ్, 2022
3. హ్యారీ బ్రూక్ – 80 బంతుల్లో vs పాకిస్తాన్, రావల్పిండి, 2022
4. జేమీ స్మిత్ – 80 బంతుల్లో vs భారత్, ఎడ్జ్‌బాస్టన్, 2025*
5. బెన్ స్టోక్స్ – 85 బంతుల్లో vs న్యూజిలాండ్, లార్డ్స్, 2015
టెస్టుల్లో రెండో సెంచరీ కొట్టిన జేమీ స్మిత్
భారత్ పై సునామీ నాక్ తో జేమీ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో తన రెండవ సెంచరీని సాధించాడు. గత సంవత్సరం మాంచెస్టర్‌లో శ్రీలంకపై అతని ఏకైక టెస్ట్ సెంచరీ వచ్చింది.
అద్భుతమైన ఆటతీరుతో, స్మిత్ టెస్టు ఫార్మాట్‌లో 800 పరుగులు దాటాడు. 12 టెస్ట్‌లలో అతని సగటు 50 కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, అతని నాలుగు హాఫ్ సెంచరీలలో ఒకటి గత సంవత్సరం అతని టెస్ట్ అరంగేట్రంలోనే చేయడం విశేషం.