ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Shubman Gill: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడిపోయింది. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ డకౌట్ అయ్యాడు. 12 టీ20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. గిల్ నిలకడ లేని ఫామ్ కారణంగా సంజు శాంసన్, యశస్వి జైశ్వల్..

టీమిండియా ఓటమి..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా 51 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రస్తుతం ఒకటి ఒకటితో సమంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 213 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. తిలక్ వర్మ మినహా మిగిలిన భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బాట్మన్ నాలుగు వికెట్లతో రాణిస్తే.. ఎంగిడి, యాన్సిన్, సిపామ్లాలకు చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.
గిల్ పేలవ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టీ20లో ఐదు పరుగులు చేసిన గిల్, రెండో టీ20లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ అయ్యాడు. అతడి టీ20 ఫార్మాట్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడం లేదు. టీ20 ఫార్మాట్‌కు గిల్ సరిపోడని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడి కంటే మెరుగైన బ్యాటర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, గిల్‌కు మాత్రం వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అతడు ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో.
గిల్ ఫ్లాప్ షో..
శుభ్‌మాన్ గిల్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 12 మ్యాచులలో ఆడాడు. ఈ మ్యాచులలో ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 30 పరుగులకు పైగా స్కోర్ సాధించాడు. ఇలా నిలకడ లేని ప్రదర్శన చేస్తున్నా గిల్‌కు అవకాశాలు లభిస్తున్నాయి. బీసీసీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇతర ఆటగాళ్ల కెరీర్‌లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్, యశస్వి జైశ్వల్ వంటి ఆటగాళ్లపై ప్రభావం పడుతోంది.
శాంసన్ సద్వినియోగం చేసుకున్నా..
రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత సంజు శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం లభించింది. అతను తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు సెంచరీలు కూడా నమోదు చేశాడు. అయితే, శుభ్‌మాన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో సంజు తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవెన్ నుంచే చోటు కోల్పోయాడు.
వన్డేల్లో ఆ ప్లేయర్ అవుట్..
వన్డేలలో యశస్వి జైశ్వల్ పరిస్థితి కూడా సంజు శాంసన్ లానే ఉంది. గిల్ ఓపెనర్‌గా కొనసాగుతుండటంతో జైశ్వల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నాడు. ఇటీవల గిల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో జైశ్వల్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. తొలి రెండు వన్డేలలో పెద్దగా రాణించకపోయినా, మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు. కేవలం మూడు మ్యాచులలోనే వన్డే ఫార్మాట్‌లో లయను అందుకున్నాడు. అయితే, గిల్ తిరిగి జట్టులోకి వస్తే జైశ్వల్ మళ్లీ బెంచ్ మీదకు వెళ్లాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇలా గిల్ వల్ల ఇద్దరు ఆటగాళ్ల కెరీర్ బలి అవుతోంది.

