- Home
- Sports
- ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ
Vaibhav Suryavanshi: అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు దుమ్మురేపింది. యూఏఈపై 432 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్యవంశీ 171 పరుగులతో అదరగొట్టగా.. అరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాలు చెరో 69 పరుగులు చేశారు.

టోర్నీ విజయంతో స్టార్ట్
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయాన్ని అందుకుంది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించి సత్తా చాటింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. ఇక ఈ స్కోర్‌లో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అద్దిరిపోయే సెంచరీ..
ఈ మ్యాచ్‌లో మరో సెంచరీతో అదరగొట్టాడు వైభవ్. దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ మ్యాచ్‌లో మరో భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 9 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగి ఏకంగా 171 పరుగులు చేశాడు. వరుసగా ఐపీఎల్, అండర్-19, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా వైభవ్ చెలరేగిపోతున్నాడు.
వైభవ్ తో పాటు ఆ ప్లేయర్స్..
వైభవ్‌తో పాటు, అరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాలు చెరో 69 పరుగులతో రాణించారు. వేదాంత్ త్రివేది 38, అభిజ్ఞాన్ కుందు 32, కనిష్క్ చౌహాన్ 28 పరుగులతో భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్రలు పోషించారు. వీరి ఇన్నింగ్స్‌లతో భారత జట్టు స్కోరు 432 పరుగులు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి.!
433 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పృథ్వీ మధు అర్ధ సెంచరీ సాధించగా.. ఉద్దిష్ సూరి 78 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఎనిమిది మంది బౌలర్లు బరిలోకి
టీమిండియా ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను బరిలోకి దింపగా.. అందరూ కూడా పొదుపుగా బౌలింగ్ వేసి.. వికెట్లు పడగొట్టారు. అటు కెప్టెన్ అయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. ఈ టోర్నీలో మొత్తంగా భారత్ అండర్-19 జట్టు విజయంతో శుభారంభం చేసింది.

