IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసా?
India vs England -Top-5 bowlers: భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది. భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఐదుగురు బౌలర్లు నిప్పులు చెరిగారు. అత్యధిక వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వివరాలు చూస్తే..
James Anderson, Anil Kumble, Ravichandran Ashwin,
1. జేమ్స్ అండర్సన్
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ లలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో జేమ్స్ అండర్సన్ టాప్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కు టెస్టు క్రికెట్ లో భారత్ పై మంచి రికార్డు ఉంది. జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకు టీమిండియాపై 35 టెస్టులు ఆడాడు. ఇందులో 24.89 బౌలింగ్ సగటుతో 139 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 6 సార్లు ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక తన టెస్టు కెరీర్ లో మొత్తంగా జేమ్స్ అండర్సన్ 690 వికెట్లు పడగొట్టాడు.
india cricket
2. భగవత్ చంద్రశేఖర్
టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లలో తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ పై 23 టెస్టుల్లో 27.27 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పై ఒక టెస్టు మ్యాచ్ లో భగవత్ చంద్రశేఖర్ 107 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నాడు. ఇక భగవత్ చంద్రశేఖర్ తన కెరీర్ లో భారత్ తరుపున 58 టెస్టుల్లో 242 వికెట్లు సాధించాడు.
3. అనిల్ కుంబ్లే
టీమిండియా దిగ్గజ బౌలర్, మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో ఆడి 30.59 సగటుతో 92 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా తన కెరీర్ లో భారత్ తరుపున 132 టెస్టులాడిన అనిల్ కుంబ్లే 619 వికెట్లు సాధించి ప్రపంచంలోని టాప్ బౌలర్ల ఒకరిగా పేరు సంపాదించారు. టెస్ట్ క్రికెట్లో అనిల్ కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్లు, 8 సార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
4. రవిచంద్రన్ అశ్విన్
భారత్-ఇంగ్లాండు టెస్టు సిరీస్ లలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో 28.59 సగటుతో 88 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తన కెరీర్ లో 95 టెస్టుల్లో 490 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ 34 సార్లు ఐదు వికెట్లు, 8 సార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
5. బిషన్ సింగ్ బేడీ
బిషన్ సింగ్ బేడీ ఇంగ్లాండ్ పై 22 టెస్టుల్లో 29.87 సగటుతో 85 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరుపున 67 టెస్టులాడిన బిషన్ సింగ్ బేడీ 266 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ లో బిషన్ సింగ్ బేడీ 14 ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్లు పడగొట్టాడు.