IND vs ENG: రోహిత్, గిల్ తుఫాను ఇన్నింగ్స్.. భారత్ సూపర్ విక్టరీ
India vs England: ఇంగ్లాంగ్ తో కటక్ లో జరిగిన రెండ్ వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ల సూపర్ ఇన్నింగ్స్ లతో టీమిండియా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
india vs england ODI
India vs England: కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ల అవసరమైన ఇన్నింగ్స్ లతో రెండో వన్డేలో కూడా ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధించింది.
రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించి భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.
భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన ఇంగ్లాండ్
కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. బెన్ డకెట్, జో రూట్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లకు తోడుగా చివరలో లివింగ్ స్టోన్ మంచి ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.
భారత్ తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ కు ఓపెనర్లు అదరిపోయే ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లతో భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి ఇంగ్లాండ్ పై విజయాన్ని అందుకుంది.
Rohit Sharma: కటక్‌లో హిట్‌మ్యాన్ గర్జన.. 32వ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ
rohit sharma
రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ
305 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత జట్టుకు గొప్ప ఆరంభం లభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించారు. మంచి జోరుమీదున్న ఈ జోడీ 17వ ఓవర్లో యంగ్ ప్లేయర్ గిల్ బౌల్డ్ కావడంతో విడిపోయింది.
గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. గిల్ తన వన్డే కెరీర్‌లో 45 బంతుల్లో 15వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. 76 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
మరోసారి నిరాశపర్చిన విరాట్ కోహ్లీ
గిల్ ఔట్ అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతికి ఔటయ్యాడు. అభిమానులను, టీమిండియాను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదిల్ రషీద్ విరాట్ ను పెవిలియన్ కు పంపాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి కోహ్లీ ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ మూడో వికెట్‌కు హిట్‌మ్యాన్‌తో 70 బంతుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన వన్డే కెరీర్ లో 32వ సెంచరీని బాదాడు. 90 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 119 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ క్యాచ్ పట్టడంతో రోహిత్ ఔట్ అయ్యాడు.
Rohit Sharma
ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో భారత్
భారత ఇతర ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యర్ 44, హార్దిక్ పాండ్యా 10, అక్షర్ పటేల్ 41*, రవీంద్ర జడేజా 11* పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు తీసుకోగా, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయంతో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది.