ICC new Rules: క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్స్
ICC new Rules: టెస్టులలో స్టాప్ క్లాక్, వన్డేల్లో ఒకే బంతిని ఉపయోగించడం సహా ఐసీసీ పలు కొత్త నిబంధనలు ప్రకటించింది. జూలై 2 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

కొత్త రూల్స్ ప్రకటించిన ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు సంబంధించి ప్రధానమైన ఆట నియమాలలో మార్పులు ప్రకటించింది. టెస్టులు, వన్డేలు, టీ20లకు వర్తించే ఈ మార్గదర్శకాల్లో కొన్ని ఇప్పటికే 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో అమలులోకి వచ్చాయి.
జూలై 2 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మార్పులు అమలవుతాయి. ఈ మార్పులు క్రికెట్ ఆటలో సమయ నిర్వహణ, సముచిత నిర్ణయాలు తీసుకోవడాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించారు. కొత్త మార్పులు గమనిస్తే..
టెస్టు క్రికెట్‌లో స్టాప్ క్లాక్ ప్రవేశం
పరిమిత ఓవర్ల ఆటల్లో విజయవంతంగా ఉపయోగించిన స్టాప్ క్లాక్ వ్యవస్థను టెస్టుల్లోకి కూడా తీసుకొచ్చింది ఐసీసీ. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్‌ను ఆరంభించాల్సి ఉంటుంది.
ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ సైడ్‌కు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.
సలైవ పై మారిన నిబంధనలు
కరోనా టైమ్ లో బంతి పట్టు కోసం సలైవా వాడకంపై నిషేధం కొనసాగింది. అయితే ఇప్పుడు సలైవా తగిలినట్టు గుర్తించిన వెంటనే బంతిని మార్చాల్సిన అవసరం ఉండదు. బంతిపై ప్రభావం తక్కువగా ఉంటే అదే బంతితో ఆట కొనసాగుతుంది.
బంతికి గణనీయమైన మార్పులు, నష్టమైతే మాత్రమే బంతిని మారుస్తారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా అధికంగా సలైవా వాడితే ఐదు పరుగుల పెనాల్టీ వర్తిస్తుంది.
డీఆర్‌ఎస్‌లో కొత్త ప్రోటోకాల్
ఒక బ్యాటర్ క్యాచ్ అవుట్‌గా ఇచ్చిన తీర్పుపై రివ్యూకు వెళ్తే, బ్యాట్‌కు బంతి తగలలేదు అని తేలితే, బంతి ప్యాడ్‌ను తాకితే తదుపరి స్టెప్‌గా లెగ్ బీఫోర్ (LBW) పరిగణనలోకి తీసుకుంటారు. ఇంతవరకు అంపైర్ కాల్‌గా ఉన్న తీర్పు ‘నాట్ అవుట్’గా పరిగణించేవారు. ఇప్పుడు అయితే అంపైర్ కాల్ అయినా కూడా, డీఆర్‌ఎస్ తీసుకునే సమయంలో ‘ఔట్’ అని కౌంట్ చేస్తారు.
మల్టిపుల్ అప్పీల్స్
ఒకే బంతికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అప్పీల్స్ ఉన్నప్పుడు, వాటిని సంభవించిన క్రమంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక బంతికి ముందు LBW తర్వాత రన్ ఔట్ అప్పీల్ వచ్చినట్లయితే, మొదటి నిర్ణయం మీదే నిర్ణయం తీసుకుంటారు. బ్యాటర్ ఔట్ అయితే తదుపరి అప్పీల్‌ను పరిగణించరు, ఎందుకంటే బంతి డెడ్‌గా మారుతుంది.
నో బాల్ అయినా క్యాచ్ చెల్లుబాటు అవుతుందా?
ఒక బంతి నో బాల్‌గా ప్రకటించినా, ఆ బంతికి క్యాచ్ తీసే పరిస్థితిని కూడా థర్డ్ అంపైర్ పరిశీలించాల్సి ఉంటుంది. క్యాచ్ క్లీన్‌గా తీసుంటే బ్యాటింగ్ జట్టు నో బాల్‌కు ఒక పరుగు మాత్రమే పొందుతుంది. క్యాచ్ క్లీన్‌గా కాకపోతే ఆటగాళ్లు చేసిన పరుగులు కూడా లెక్కిస్తారు.
డిలిబరేట్ షార్ట్ రన్‌పై కఠిన చర్యలు
ఐసీసీ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ చేయడం పై కొత్త శిక్షలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు పరుగుల పెనాల్టీ మాత్రమే ఉండేది. కొత్త నియమం ప్రకారం, అంపైర్ బ్యాటింగ్ జట్టుకు పరుగులు ఇవ్వకుండా, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు తదుపరి బంతికి స్ట్రైక్‌లో ఉండాల్సిన బ్యాటర్‌ను ఎంచుకునే అవకాశం ఇస్తారు.
గాయలైతే పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఆటగాడు
ఒక ఆటగాడు స్పష్టంగా కనిపించే గాయంతో మ్యాచ్ మధ్యలోనే దూరం అయితే, అతని స్థానంలో సమాన తరహా ఆటగాడితో ప్రత్యామ్నాయ మార్పిడి చేసుకునే అవకాశం ఇస్తోంది ఐసీసీ.
ఇది ప్రస్తుతానికి డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రమే ప్రయోగాత్మకంగా అమలవుతుంది. కండరాల నొప్పి, అంతర్గత గాయాలకు ఇది వర్తించదు.
వన్డేల్లో ఒక్క బంతి పద్ధతి తిరిగి ప్రవేశం
జూలై 2 నుంచి వన్డే మ్యాచుల్లో 35వ ఓవర్ తర్వాత ఒకే ఒక బంతిని మాత్రమే ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు రెండు ఎండ్స్ నుండి వేరే వేరే బంతులు వాడటం వల్ల బంతికి తక్కువ నష్టం జరుగుతోంది. ఈ కొత్త మార్పుతో రివర్స్ స్వింగ్‌కు అవకాశాలు పెరిగి బ్యాటింగ్‌కు కొంత సవాలుగా మారే అవకాశం ఉంది.