IND vs ENG: ఇది టెస్ట్ స్థాయి ఫీల్డింగ్ కాదు.. టీమిండియా పై సునీల్ గవాస్కర్ ఫైర్
Sunil Gavaskar criticizes Indias fielding: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, జడేజా బౌలింగ్‌ను తీవ్రంగా విమర్శించారు.
చెత్త ఆట ఆడారు.. లీడ్స్ మ్యాచ్ ఓటమిపై గవాస్కర్ విమర్శలు
శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని భారత యువ జట్టు లీడ్స్ వేదికగా జరిగిన హెడ్డింగ్లీ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నా.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ మెరుగ్గా లేకపోవడం, చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలిపెట్టడంతో భారత జట్టు ఓడిపోయింది.
ఈ ఓటమితో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధానంగా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలు, ఫీల్డింగ్ దారుణంగా ఉండటంతోనే భారత జట్టు ఓడిపోయిందని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
ఐదు సెంచరీలు.. మంచి ఛాన్స్ ను మిస్ చేశారు
భారత జట్టు ప్లేయర్లు ఈ మ్యాచ్ లో ఐదు సెంచరీలు బాదారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ సహా ఐదుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించినా కీలక సమయాల్లో వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారీ స్కోర్ ను మరింతగా పెంచలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో 430-3 పరుగుల నుంచి 471 ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే పరిస్థితి కనిపించింది. 333-4 పరుగుల నుంచి 364 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రెండు సందర్భాల్లోనూ భారీ స్కోరు చేసే అవకాశాలు వృథా అయ్యాయని సునీల్ గవాస్కర్ అన్నారు. దీంతో ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని చివరి రోజున సులభంగా చేధించిందని చెప్పారు.
ఇది టెస్ట్ స్థాయి ఆట కాదు: ఫీల్డింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం
సోనీ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. “భారత జట్టు ఫీల్డింగ్ చాలా సాధారణంగా కాకుండా చెత్తగా ఉంది. కేవలం క్యాచ్‌లు కాకుండా అవుట్‌ఫీల్డ్ కూడా మంచి స్థాయిలో లేదు. ఇది టెస్ట్ స్థాయి ఆట కాదు” అంటూ తీవ్రంగా స్పందించారు.
అలాగే, బెన్ డకెట్ 97 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను యశస్వి జైస్వాల్ మిస్ చేయడం పై స్పందిస్తూ.. అది మ్యాచ్ మలుపుతిప్పే కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. “ఈ తప్పిదాల నుంచి నేర్చుకోవాలి” అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
బౌలింగ్ విభాగంలో లోపాలు: జడేజాపై తీవ్ర విమర్శలు
భారత బౌలింగ్‌ను కూడా గవాస్కర్ విమర్శించారు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో 5-83తో మెరిసినా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ సాధించలేకపోయారు. ప్రత్యేకించి జడేజా పైన గవాస్కర్‌తో పాటు మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఇది ఫైనల్ డే పిచ్. జడేజాకు సహాయపడే రఫ్ కూడా ఉంది. కానీ, అతను కేవలం ఒక వికెట్‌నే తీసుకున్నాడు. బెన్ డకెట్ అతని బౌలింగ్‌ను తిరుగులేకుండా ఆడాడు. ఇది నిరాశ కలిగించే విషయం” అని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. జడేజా కేవలం ఒక వికెట్ తీసుకుని 104 పరుగులు ఇచ్చాడు.
రెండో టెస్టులో మార్పులు ఉండాల్సిందే: గవాస్కర్
జూలై 2న ప్రారంభం కానున్న రెండో టెస్ట్ కోసం జట్టు లో మార్పులు అవసరమని గవాస్కర్ అన్నారు. “జస్ప్రీత్ బుమ్రా ఫిట్ అయినా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలి. షార్దుల్ ఠాకూర్ స్థానంలో అతడిని తీసుకోవడం మంచిది. బర్మింగ్‌హామ్ పిచ్ చైన్ మ్యాన్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది” అని తెలిపారు.
అలాగే, రెండో టెస్టులో కూడా ఫలితం అనుకూలించకపోతే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లాంటి యువ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని, బ్యాటింగ్ లో స్థిరత కోసం వాషింగ్టన్ సుందర్‌ను కూడా జట్టులోకి తీసుకోవచ్చని సూచించారు.
భారత జట్టు ప్రదర్శనపై గంభీర్ ఏం చెప్పారంటే?
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను సమర్థించేందుకు ప్రయత్నించారు. “వారే ఈ ఓటమిపై ఎక్కువగా నిరాశ చెందారు. ఎందుకంటే విజయం సాధించడానికి ఆ అవకాశాన్ని వారు గుర్తించారు” అని ఆయన చెప్పారు. “ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ముందున్న టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన అందిస్తారని ఆశిస్తున్నాను” అని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, మ్యాచ్ మొదటి నాలుగు రోజుల్లోనూ భారత్ కుదురుగా ఉండగలిగినా, చివరి రోజు బెన్ డకెట్ (149 పరుగులు), జాక్ క్రాలీ ఆత్మవిశ్వాసంతో ఆడి భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. భారత జట్టు ప్లేయర్లలో గెలుపు కసి కనిపించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
మొత్తంగా “ఇంగ్లాండ్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. భారత్‌కు ఐదుగురు సెంచరీలు చేసినా మ్యాచ్ ను కాపాడుకోవడంలో విఫలమైంది. లోయర్ ఆర్డర్ వికెట్లు త్వరగా సమర్పించుకున్నారు. బౌలింగ్ పదును లేదు. ఫీల్డింగ్ చెత్తగా ఉండటమే ఓటమికి కారణం అయ్యింది. ఇది తొలి టెస్ట్ మాత్రమే. రాబోయే మ్యాచ్ ల కోసం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి” అని సునీల్ గవాస్కర్ అన్నారు.