Suryakumar: హాస్పిటల్ బెడ్ పై టీమిండియా స్టార్.. సూర్యకుమార్ యాదవ్ కు ఏమైంది?
Suryakumar: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాస్పిటల్ బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. సూర్యకు ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకు చేరారు?

జర్మనీ ఆస్పత్రిలో సూర్యకుమార్ యాదవ్
టీమిండియా స్టార్ బ్యాటర్, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అతను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇటీవల జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఆటగాళ్లకు సాధారణంగా కనిపించే "స్పోర్ట్స్ హెర్నియా"కు సూర్య శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటుండగా, వచ్చే ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశముంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్
తన చికిత్స విషయాలు సూర్యకుమార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. “లైఫ్ అప్‌డేట్: కుడివైపు తక్కువ భాగంలో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. సర్జరీ విజయవంతంగా జరిగిందని చెప్పేందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే కోలుకోవడం ప్రారంభించాను. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నాడు.
ఇదిలాఉండగా, ఇది సూర్యకుమార్‌కు గత మూడు సంవత్సరాల్లో మూడోసారి శస్త్రచికిత్స కావడం గమనార్హం. 2023లో మోకాలికి శస్త్రచికిత్స, 2024లో కూడా హెర్నియా చికిత్స జరిగింది. అయినప్పటికీ, ఆయన ఆసియా కప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2024లో భారత విజయాలలో కీలకం పాత్ర పోషించారు.
ఐపీఎల్ 2025లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టిన సూర్యకుమార్
34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున గొప్ప ప్రదర్శన ఇచ్చారు. ప్లేఆఫ్స్‌కు జట్టు చేరేలా కీలక పాత్ర పోషించిన ఆయన, వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25కిపైగా పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేశారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో మొత్తం 717 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో ఓ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులూ ఇవే.
బంగ్లాదేశ్ లో భారత్ తర్వాతి టూర్
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటోంది. ఇది ఆగస్టు 4తో ముగియనుంది. అనంతరం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లను ఆడనుంది. టీ20 సిరీస్ ఆగస్టు 26 నుంచి చట్టోగ్రామ్‌లో ప్రారంభం కానుంది.
వన్డేల్లో గ్యాప్ ను శస్త్రచికిత్సకు ఉపయోగించుకున్న సూర్య కుమార్
2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డేల్లో చోటు దక్కని సూర్యకుమార్, ఈ విరామ సమయాన్ని తన శస్త్రచికిత్సకు వినియోగించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం రెండు వారాల తర్వాత బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నారు.
ఐపీఎల్ నుంచి భారత టీ20 కెప్టెన్ వరకు సూర్య అద్భుత ప్రయాణం
జూన్ 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. ఈ విజయం తర్వాత స్టార్ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
అప్పటి నుంచి భారత టీ20 జట్టు దూకుడు ఆటతీరును అవలంబిస్తూ ప్రపంచ స్థాయిలో పెద్ద టోటల్స్ సాధిస్తోంది. అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్‌పై 297 పరుగులు చేసిన భారత జట్టు, టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు నాలుగు సెంచరీలతో 3,000కుపైగా పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ టాప్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అతని మొత్తం అంతర్జాతీయ పరుగులలో 75% టీ20ల నుంచే వచ్చాయి.