India vs England: చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. భారత్‌పై ఒకేఒక్కడు
India vs England: ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ బ్యాటర్ జేమీ స్మిత్ 184 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రికార్డుల మోత మోగించాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎడ్జ్‌బాస్టన్‌లో జేమీ స్మిత్ కొత్త రికార్డు
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఇంగ్లాండ్ కు కష్ట సమయంలో జేమీ స్మిత్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును కాపాడాడు. 84/5 పరుగుల వద్ద ఉన్న ఇంగ్లాండ్ ను అద్భుతమైన సెంచరీతో 400 పరుగులు దాటించాడు. ఈ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. జేమీ స్మిత్ 184 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టును గౌరవప్రదమైన స్థితిలో నిలిపాడు.
ఈ ఇన్నింగ్స్‌తో జేమీ స్మిత్ టెస్ట్ చరిత్రలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ 150 పరుగులు చేసిన 5వ ప్లేయర్ గా నిలిచాడు. ఇది భారత్‌పై నాలుగవ వేగవంతమైన 150గా నమోదైంది.
బజ్‌బాల్ శైలిలో దూకుడుగా ఆడిన జేమీ స్మిత్
24 ఏళ్ల జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్‌తో కలిసి బజ్‌బాల్ మంత్రాన్ని పాటిస్తూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. జో రూట్ (22 పరుగులు), బెన్ స్టోక్స్ (0 పరుగులు) తొందరగా అవుట్ అయిన తర్వాత ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన జేమీ స్మిత్ ధైర్యంగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించాడు.
తన సెంచరీని కేవలం 80 బంతుల్లోనే పూర్తి చేశాడు. అలాగే, 150 పరుగుల మైలురాయి కేవలం 144 బంతుల్లో సాధించటం విశేషం. ఇంగ్లాండ్ తరఫున వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హ్యారీ బ్రూక్ టాప్ లో ఉన్నాడు.
- హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు
- బెన్ స్టోక్స్ 135 బంతుల్లో 150 పరుగులు
- బెన్ డకెట్ 140 బంతుల్లో 150 పరుగులు
- ఓలీ పోప్ 142 బంతుల్లో 150 పరుగులు
- జేమీ స్మిత్ 144 బంతుల్లో 150 పరుగులు
భారత్‌పై టెస్టుల్లో వేగవంతమైన 150లు పరుగులు చేసిన ప్లేయర్లు
- 126 బంతులు – షాహిద్ అఫ్రిది vs భారత్, 2006
- 128 బంతులు – డేవిడ్ వార్నర్ vs భారత్, 2012
- 140 బంతులు – బెన్ డకెట్ vs భారత్, 2024
- 144 బంతులు – జేమీ స్మిత్ vs భారత్, 2025
జేమీ స్మిత్ సెంచరీ కూడా ప్రత్యేకమే
జేమీ స్మిత్ తన సెంచరీని కేవలం 80 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది ఇంగ్లాండ్ తరఫున మూడవ వేగవంతమైన టెస్ట్ సెంచరీగా నిలిచింది.
ఇంగ్లండ్‌కు వేగవంతమైన టెస్టు సెంచరీలు
- 76 బంతులు – గిల్బర్ట్ జెస్సప్ vs ఆస్ట్రేలియా, 1902
- 77 బంతులు – జానీ బెయిర్‌స్టో vs న్యూజిలాండ్, 2022
- 80 బంతులు – జేమీ స్మిత్ vs భారత్, 2025
వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ కొత్త రికార్డు
మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులు చేసింది. జేమీ స్మిత్ 184* పరుగులు అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో వికెట్‌కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా జేమీ స్మిత్ నిలిచాడు.
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ల టెస్ట్ బెస్ట్ స్కోర్లు
- 184* - జేమీ స్మిత్ vs భారత్, 2025
- 173 - అలెక్ స్టీవర్ట్ vs న్యూజిలాండ్, 1997
- 167* - జానీ బెయిర్‌స్టో vs శ్రీలంక, 2016
- 164 - అలెక్ స్టీవర్ట్ vs దక్షిణాఫ్రికా, 1998
- 152 - జోస్ బట్లర్ vs పాకిస్థాన్, 2020
భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీసుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆరుగురు ప్లేయర్లు ‘డక్’ (0 పరుగులు) గా అవుట్సా కావడం టెస్ట్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా నిలిచింది.