- Home
- Sports
- Cricket
- అభిమానులకు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్.. అయినా అసంతృప్తిగా ఉందన్న గంభీర్
అభిమానులకు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్.. అయినా అసంతృప్తిగా ఉందన్న గంభీర్
Cricket: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 406 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయంతో జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నా.. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం మ్యాచ్ జరిగిన గౌహతి పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారీ స్కోర్లు నమోదైనా..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన గంభీర్.. గౌహతిలో జరిగిన పోరు పూర్తిస్థాయి క్రికెట్ మ్యాచ్‌లా అనిపించలేదని వ్యాఖ్యానించాడు. బ్యాటర్లు పరుగులు చేయడానికి అత్యంత అనుకూలంగా ఉన్న పిచ్‌పై బౌలర్లకు పెద్దగా అవకాశాలు లేకపోవడాన్ని ప్రస్తావించాడు. ఒక జట్టు 400కుపైగా పరుగులు చేయడం, మరో జట్టు అదే లక్ష్యాన్ని ఛేదించడం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండొచ్చు. రికార్డులు, వినోదం పరంగా ఇది ఆకట్టుకున్నా.. ఆటలోని రెండు విభాగాల మధ్య పోటీ లేకపోవడం మాత్రం తనకు అసంతృప్తి కలిగించిందని చెప్పాడు.
బౌలర్లకూ పోరాడే అవకాశం ఉండాలి
పిచ్ తయారీలో బ్యాటర్లతో పాటు బౌలర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని గంభీర్ సూచించాడు. బంతి స్వింగ్ అవ్వడం, పిచ్ నుంచి కొంత సహకారం లభించడం, షాట్లు ఆడే బ్యాటర్లకు సవాలు ఎదురవ్వడం వంటి అంశాలు ఉంటేనే పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా యువ బౌలర్లు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తే వారిపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి ఫ్లాట్ పిచ్‌లపై పరుగులు సమర్పించినందుకు బౌలర్ల వ్యక్తిగత గణాంకాలను ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
అకిబ్ నబీకి మరో అవకాశం
ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన అకిబ్ నబీకి పరిస్థితులు అనుకూలించలేదని గంభీర్ చెప్పాడు. అతడితో పాటు భారత బౌలింగ్ విభాగం మొత్తం కఠిన పరిస్థితులను ఎదుర్కొందని వివరించాడు. అందుకే ఒక్క మ్యాచ్ ఆధారంగా యువ ఆటగాడిపై అంచనాకు రావడం సరికాదన్నాడు. రాబోయే మ్యాచ్‌లోనూ అకిబ్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. అలాగే గుర్నూర్ బ్రార్ ప్రదర్శనను కూడా ప్రస్తావిస్తూ.. అతడు ఇన్నింగ్స్ ఆరంభంలోనే కాకుండా చివరి ఓవర్లలోనూ బౌలింగ్ చేశాడని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడు బాధ్యత తీసుకున్న విషయాన్ని గుర్తించాలని గంభీర్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌కు ముందు ప్రయోగాలకు పరిమిత సమయమే
2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకాలకు భారత్‌కు ఎక్కువ సమయం లేదని గంభీర్ వెల్లడించాడు. టోర్నీకి ముందు ఉన్న ఏడాదిలో ఐపీఎల్ కారణంగా దాదాపు మూడు నెలలు, భారత్-ఆస్ట్రేలియా సిరీస్ కారణంగా మరో మూడు నెలలు అంతర్జాతీయ వన్డేలకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పాడు. దీంతో ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే వన్డేల సంఖ్య సుమారు 20 వరకు మాత్రమే ఉండొచ్చని వివరించాడు. ఈ పరిమిత అవకాశాల్లోనే ఆటగాళ్ల సామర్థ్యాలను అంచనా వేసి సరైన కలయికను గుర్తించాల్సి ఉంటుందని తెలిపాడు.
ఐపీఎల్ తర్వాత కీలక ఆటగాళ్లతో బరిలోకి
ప్రస్తుతం ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తామని గంభీర్ స్పష్టం చేశాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో వేర్వేరు కాంబినేషన్లను పరీక్షిస్తూ ప్రపంచకప్‌కు అవసరమైన జట్టు నిర్మాణంపై స్పష్టత తెచ్చుకుంటామని చెప్పాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లతో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడిస్తూ తుది జట్టు కూర్పుపై దృష్టి పెడతామని వెల్లడించాడు. ఈ క్రమంలో ఒక మ్యాచ్‌లో అకిబ్ నబీకి అవకాశం వచ్చినట్లే.. భవిష్యత్ పోరులో మరో ఆటగాడిని పరీక్షించే అవకాశం ఉంటుందని గంభీర్ చెప్పాడు.

