Facts About India: ఇండియా గురించి మీకు తెలియని 10 అరుదైన విషయాలు!
Facts About India: భారతదేశ గొప్పతనం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, నిర్మాణాలు, విశేషాలకు నెలవు మన భారతదేశం. ఇప్పుడు ఇక్కడ తెలియజేసిన 10 విషయాలు చాలా మందికి తెలియవు. అరుదైన, ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం రండి.

వారణాసి: అతి పురాతన నగరం
కాశీ లేదా బెనారస్ అని పిలిచే వారణాసి నగరం ప్రపంచంలోనే అతి పురాతనమైన నివాసయోగ్యమైన నగరం. దీని చరిత్ర 5,000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉంది.
మావ్సిన్రామ్: అత్యధిక వర్షపాతం ఉన్న ప్రదేశం
మేఘాలయలో ఉన్న మావ్సిన్రామ్ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రదేశంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ దాదాపు 11,873 మి.మీ వర్షం కురుస్తుంది.
ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పోస్టాఫీసు
భారతదేశంలో ఒక ప్రత్యేకమైన తేలియాడే పోస్టాఫీసు ఉంది. ఇది శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఉంది. ఇందులో ఒక స్టాంప్ మ్యూజియం కూడా ఉంది. ఇలాంటి పోస్టాఫీసు ప్రపంచలో మరెక్కడా లేదు.
వజ్రాల గని కలిగిన మొదటి దేశం
ఈ భూమ్మీద భారతదేశం వజ్రాల గని కలిగిన మొదటి దేశం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఇక్కడ వజ్రాలు ఉన్నాయని గుర్తించారు. చాలా సంవత్సరాలు ప్రపంచానికి వజ్రాలు సరఫరా చేసింది భారతదేశమే.
వైకుంఠపాళి భారతదేశంలోనే మొదలైంది
పాము, నిచ్చెనల ఆటగా పేరుపొందిన వైకుంఠపాళి ఆట భారతదేశంలోనే మొదలైంది. ఈ ఆటను ఇతర దేశాల్లోని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు.
ఆవులను పవిత్ర జంతువులుగా భావిస్తారు
ఈ ప్రపంచం మొత్తం మీద హిందూ సంస్కృతిలో మాత్రమే ఆవులను పూజిస్తారు. ఈ నమ్మకం వల్లే చాలా రాష్ట్రాల్లో గోవులను చంపకూడదన్న చట్టాలు తయారయ్యాయి.
రూప్‌కుండ్: అస్థిపంజరాల సరస్సు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు ఇది. 1942 లో సరస్సు అంచున ఐదు వందల అస్థిపంజరాలను కనుగొన్నారు. హిమాలయాలలో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉంది.
భాషా వైవిధ్యం
భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. వీటిలో హిందీ ఎక్కువ మంది మాట్లాడే భాష. ఇన్ని అధికారిక భాషలున్న దేశం మరేదీ లేదు. ఇవి కాకుండా స్థానికంగా మాట్లాడుకొనే భాషలు సుమారు 200లకు పైగా ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం
మిజోరంలోని జియోనా చానా అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతనికి 39 మంది భార్యలు, చాలా మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు.
సుగంధ ద్రవ్యాలకు పెద్ధ పేరు
భారతదేశం సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే దేశాల్లో అతిపెద్దది. ఇక్కడ అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి.