Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !
Union Budget : 1997లో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను డ్రీమ్ బడ్జెట్ అని పేర్కొంటారు. ఆదాయపు పన్ను తగ్గింపు నుండి ఆర్థిక సంస్కరణల వరకు ఆ బడ్జెట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశ చరిత్రలో డ్రీమ్ బడ్జెట్ : ఆ రోజు పార్లమెంట్‌లో ఏం జరిగింది?
పీఎం మోదీ ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఏ దేశానికైనా బడ్జెట్ అనేది అత్యంత ముఖ్యమైన, కీలకమైన ఘట్టం.
దేశ ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో దీనిని ప్రవేశపెట్టే వరకు బడ్జెట్ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. రాబోయే ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల వివరాలే ఈ బడ్జెట్. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏయే రంగాలకు ఎంత కేటాయించబోతోంది, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టబోతోంది అనేది బడ్జెట్ ద్వారానే దేశ ప్రజలకు తెలియజేస్తుంది.
బడ్జెట్ సీజన్ నడుస్తున్న వేళ, మనం గతంలో జరిగిన కొన్ని చరిత్రాత్మక బడ్జెట్ ఘట్టాలను గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం 1997 నాటి బడ్జెట్ గురించి తెలుసుకుందాం. అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్‌ను చరిత్రలో డ్రీమ్ బడ్జెట్ (Dream Budget) అని పిలుస్తారు. అసలు దానిని డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు అంటారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు గమనిస్తే..
నాటి ప్రధాని హెచ్.డి. దేవెగౌడ హయాంలో డ్రీమ్ బడ్జెట్
అది 1997వ సంవత్సరం. అప్పట్లో దేశ ప్రధానమంత్రిగా హెచ్.డి. దేవెగౌడ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వంలో, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1997 ఫిబ్రవరి 28న పి. చిదంబరం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రాజకీయంగా చూస్తే, దేవెగౌడ 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. ఆయన తర్వాత 1997 ఏప్రిల్ 21న ఐ.కె. గుజ్రాల్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. సరిగ్గా దేవెగౌడ పదవీకాలం ముగియడానికి కొద్ది నెలల ముందు ఈ చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
1997 బడ్జెట్‌లో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు
1997 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. దేశ పౌరులకు, వ్యాపారవేత్తలకు, విదేశీ పెట్టుబడిదారులకు మేలు చేసే అనేక సాహసోపేతమైన నిర్ణయాలను ఇందులో ప్రకటించారు. ఆ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇవే:
- ఆదాయపు పన్నులో భారీ కోత: ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income Tax) గరిష్ఠ రేటును 40 శాతం నుండి 30 శాతానికి తగ్గించారు. ఇది మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు భారీ ఊరటను ఇచ్చింది.
- కార్పొరేట్ పన్ను తగ్గింపు: దేశంలోని కంపెనీలపై ఉండే కార్పొరేట్ పన్నుపై సర్ ఛార్జీని ఎత్తివేసారు. అంతేకాకుండా పన్ను రేట్లలో కూడా కోత విధించారు.
- కస్టమ్స్ సుంకం తగ్గింపు: దిగుమతి సుంకాల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించారు.
విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సంస్కరణలు
కేవలం పన్ను తగ్గింపులే కాకుండా, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు కూడా చేపట్టారు.
- విదేశీ పెట్టుబడులకు ద్వారాలు: భారతీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి పరిమితిని పెంచారు. దీంతో విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు భారతదేశంలో మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభించింది.
- నల్లధనం వెలికితీత: దేశంలో దాగి ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇనకమ్ స్కీమ్ ను ఈ బడ్జెట్‌లో ప్రారంభించారు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆశించారు.
- సేవా రంగం: ఆనాటి బడ్జెట్‌లో సర్వీస్ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
- ఎల్పీజీ (LPG) విధానం: 1991లో ప్రారంభమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని మరింత సమర్థంగా అమలు చేసేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారు.
దీనిని డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు పిలుస్తారు?
సాధారణంగా బడ్జెట్ అంటే పన్నుల పెంపు, ధరల పెరుగుదల అనే భయం ప్రజల్లో ఉంటుంది. కానీ, ఊహించని విధంగా వరాల జల్లు కురిపిస్తే దాన్నే డ్రీమ్ బడ్జెట్ అంటారు. 1997 బడ్జెట్ అచ్చం అలాగే ఉంది.
మీడియా రిపోర్టుల ప్రకారం.. ఆదాయపు పన్ను రేటును 40% నుంచి 30%కి తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు. అలాగే కార్పొరేట్ పన్ను తగ్గింపు కూడా వ్యాపార వర్గాలకు పెద్ద శుభవార్తగా మారింది. సామాన్యుల నుంచి బడా కార్పొరేట్ కంపెనీల వరకు అందరికీ ఈ బడ్జెట్ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది.
ఈ బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది. పన్నులు తగ్గించినప్పటికీ, ప్రభుత్వ ఆదాయం మాత్రం పెరిగింది. రిపోర్టుల ప్రకారం, అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో దాదాపు రూ. 18,700 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది ఆర్థిక సంస్కరణల్లో ఒక గొప్ప విజయంగా పరిగణించారు. అందుకే పి. చిదంబరం ప్రవేశపెట్టిన 1997 బడ్జెట్‌ను చరిత్రలో డ్రీమ్ బడ్జెట్ గా అభివర్ణిస్తారు.

