Silver : బంగారం కాదు.. వెండి కొనడమే బెటర్ ! ట్రంప్ చేతిలో సిల్వర్ బాంబ్
Silver Prices : బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హై రికార్డులను తాకాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే ఒక్క నిర్ణయంతో వెండి ధరలు మరింత భగ్గుమనే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బంగారం కంటే వెండిదే హవా... ట్రంప్ చేతిలో 'సిల్వర్' రిమోట్!
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములకు రూ. 1.40 లక్షల మార్కును దాటగా, వెండి ధరలు బంగారం రిటర్న్స్‌ను కూడా వెనక్కి నెట్టి కిలోకు రూ. 2.70 లక్షల గరిష్ఠ స్థాయిని తాకాయి.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే ఇప్పట్లో సామాన్యులకు ధరల విషయంలో ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారికి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే తుపానులా మారుతున్న బంగారం, వెండి ధరలు... అమెరికా తీసుకునే ఒక్క నిర్ణయంతో సునామీలా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వెండి ధరలు ఎందుకు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి?
ప్రస్తుతం రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న వెండి ధరలు వినియోగదారులను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా వెండి ధరలపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు బలమైన పారిశ్రామిక డిమాండ్ కారణంగా సిల్వర్ రేట్లు నిరంతరం పెరుగుతున్నాయి.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, తిరుగుబాట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో, సురక్షితమైన పెట్టుబడిగా వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం గమనార్హం. డిమాండ్, సప్లై మధ్య ఏర్పడిన ఈ భారీ అంతరం కారణంగా వెండి ధరలలో బ్యాక్‌వర్డేషన్ అనే అరుదైన పరిస్థితి నెలకొంది.
గణాంకాలను పరిశీలిస్తే, వెండి స్ట్రక్చరల్ డెఫిసిట్ నిరంతరం పెరుగుతోంది. సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్టు ప్రకారం, గత ఐదేళ్లుగా మార్కెట్‌లో వెండి కొరత ఉంది. 2024లో వెండికి 2.1 బిలియన్ ఔన్సుల డిమాండ్ ఉండగా, సరఫరా మాత్రం 1 బిలియన్ ఔన్సుల కంటే తక్కువగానే ఉంది. అంటే వెండికి భారీ కొరత ఏర్పడింది. వెండి ఒక ఉప ఉత్పత్తి కావడంతో, ముడి ఖనిజం నాణ్యత తగ్గడం వల్ల దాని ఉత్పత్తి కూడా తగ్గుతోంది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉంటే ధరలు వేగంగా పెరగడం సహజం.
ట్రంప్ కార్డ్ తో బంగారం, వెండికి రెక్కలు
ప్రస్తుతం ఉన్న వెండి కొరత ధరలను తగ్గనిచ్చేలా లేదు. గత ఏడాది కాలంగా వెండి ధరలను పరిశీలిస్తే, జనవరి 2025లో కిలో రూ. 90 వేలుగా ఉన్న వెండి, జనవరి 2026 నాటికి రూ. 2.65 లక్షల స్థాయికి చేరింది. అదే సమయంలో అమెరికా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌లో తిరుగుబాటు, అమెరికా హెచ్చరికల వల్ల అంతర్జాతీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వెనిజులా తర్వాత ట్రంప్ గ్రీన్లాండ్‌పై ఆధిపత్యం కోరుకుంటున్నారని, ఇది నాటో దేశాల మధ్య చీలికకు దారితీస్తోందని సమాచారం.
వెనిజులా చమురు నిల్వలను అమెరికా తన ఆధీనంలోకి తీసుకోవడంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా కుదుపులకు లోనైంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ 2026లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లలో పెట్టుబడులు తగ్గి, బంగారం, వెండి వైపు మళ్లుతాయి, ఇది ధరలను మరింత పెంచుతుంది.
అమెరికా నిర్ణయంతో పేలనున్న సిల్వర్ బాంబ్
అమెరికాలో జరగబోయే ఒక కీలక నిర్ణయం వెండి ధరలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో సెక్షన్ 232 కింద దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం వెండి, రాగి లేదా ఇతర ఖనిజాలను అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించి, వాటిని అరుదైన ఖనిజాల జాబితాలో చేర్చితే, వెండి ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది.
వెండి దిగుమతి తమ జాతీయ భద్రతకు ఏమైనా ముప్పు కలిగిస్తుందా అనే కోణంలో అమెరికా కామర్స్ మినిస్ట్రీ ఈ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత రిపోర్టు అమెరికా అధ్యక్షుడికి వెళ్తుంది.
ట్రంప్ చేతిలోనే వెండి ధరల రిమోట్
అధ్యక్షుడు ట్రంప్ 2025లో క్రిటికల్ మినరల్స్‌పై సెక్షన్ 232 దర్యాప్తును ప్రారంభించారు. ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ 1962 ప్రకారం వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తుంది. వెండి దిగుమతి అమెరికా భద్రతకు ముప్పు అని తేలితే, దానిపై భారీగా దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది.
అమెరికా వెండి దిగుమతిపై 25 నుండి 50 శాతం సుంకం విధించే అవకాశం ఉంది. ఇలా జరిగితే, ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు అయిన అమెరికాలోకి వెండి రావడం కష్టమవుతుంది. అమెరికా ఈ నిర్ణయం తీసుకుందంటే, వెండిని అత్యంత కీలకమైన, అరుదైన లోహంగా గుర్తించినట్లే. దీంతో ప్రపంచ మార్కెట్‌లో వెండికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతుంది. అమెరికానే భయపడుతోందంటే, వెండి దొరకదేమో అన్న ఆందోళనతో మిగిలిన దేశాలు, ఇన్వెస్టర్లు వెండిని ఎగబడి కొంటారు. గతంలో 2018లో స్టీల్, అల్యూమినియం విషయంలో ట్రంప్ ఇలాగే చేశారు. ఇప్పుడు వెండి విషయంలోనూ అదే జరిగితే ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
భారత్‌పై పడనున్న ప్రభావం
అమెరికా టారిఫ్ నిర్ణయాల వల్ల డాలర్ కరెన్సీ బలహీనపడే అవకాశం ఉంది. టారిఫ్‌ల వల్ల ఎగుమతులపై ప్రభావం పడి డాలర్ విలువ తగ్గుతుంది. డాలర్ బలహీనపడటం అంటే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి మరింత బలపడటమే. టారిఫ్, వాణిజ్య చర్చలు మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టడం పెరిగింది.
అమెరికా తీసుకునే ఈ నిర్ణయాల వల్ల భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా అనేక క్రిటికల్ మినరల్స్‌ను భారీగా దిగుమతి చేసుకునే దేశం. అక్కడ ఆంక్షలు విధిస్తే, మిగిలిన దేశాలపై డిమాండ్ ఒత్తిడి పెరుగుతుంది. డిమాండ్, సప్లై మధ్య ఏర్పడే ఈ భారీ అంతరం ధరలలో పెద్ద ఎత్తున పెరుగుదలకు కారణమవుతుంది.

