- Home
- Business
- Silver Price: లక్ష రూపాయలు పడిపోనున్న వెండి ధర.. ఆ రోజులు మళ్లీ రిపీట్ కానున్నాయా.?
Silver Price: లక్ష రూపాయలు పడిపోనున్న వెండి ధర.. ఆ రోజులు మళ్లీ రిపీట్ కానున్నాయా.?
Silver Price: వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర రూ. 3 లక్షలు దాటేసింది. అయితే పెరుగుట విరుగుటకే అన్నట్లు వెండి ధరలు తగ్గనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.

1980 చరిత్ర తిరిగి రానుందా?
దేశీయ మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో భారీ పతనం వచ్చే అవకాశాలపై చర్చ మొదలైంది. నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలు ఒక దశలో గరిష్టానికి చేరిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. 1980లో జరిగినట్లే ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
లక్ష రూపాయల వరకు పడిపోవచ్చా?
ప్రస్తుతం వెండి ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరల లక్ష్యం ఔన్స్‌కు 100 డాలర్లు. దేశీయ మార్కెట్‌లో లక్ష్యం కిలోకు రూ.3.25 లక్షలు నుంచి రూ.3.30 లక్షలుగా ఉంది. ఈ స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ మొదలైతే ధరలు 30 శాతం వరకు పడిపోవచ్చని అంచనా. అంటే ఒక లక్ష రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధరలు పడిపోవడానికి కారణాలు
ప్రస్తుతానికి వెండి ధరలు ఎక్కువగా ఉండటానికి టారిఫ్ భయాలు ప్రధాన కారణం. ట్రంప్ విధించిన టారిఫ్ నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. అయితే రాబోయే రోజుల్లో టారిఫ్ ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడితే వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ అంశాలు కలిసి ధరలను కిందకు లాగవచ్చని అంచనా.
ఇన్వెస్టర్లు ఎందుకు వెండి నుంచి దూరమవుతున్నారు?
వెండి ధరలు చాలా ఎత్తుకు చేరడంతో లాభాల అవకాశాలు పరిమితంగా మారుతున్నాయి. ఈ దశలో పెట్టుబడిదారులు కాపర్, అల్యూమినియం లాంటి ఇతర లోహాల వైపు చూస్తున్నారు. దీనిని మెటల్స్ రీప్లేస్‌మెంట్ థియరీగా మార్కెట్‌లో పిలుస్తారు. మరోవైపు గోల్డ్–సిల్వర్ రేషియో 14 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉంది. ఇది మళ్లీ పెరిగితే వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.
1980, 2011 అనుభవం ఇప్పుడు పునరావృతమవుతుందా?
చరిత్రను పరిశీలిస్తే 1980లో వెండి ధరలు ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద గరిష్టానికి చేరాయి. ఆ తర్వాత రెండు నెలల్లోనే 70 శాతం వరకు పతనం చూశాయి. 2011లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఐదు నెలల్లో 32 శాతం తగ్గుదల నమోదైంది. మార్కెట్ నిపుణుడు అజయ్ కేడియా అభిప్రాయం ప్రకారం ఈసారి కూడా వెండి ధరలు రూ.3.25 లక్షలు దాటితే అక్కడి నుంచి భారీ పతనం తప్పదని అంటున్నారు. ఖరీదైన వెండికి ప్రత్యామ్నాయాలు తయారీ రంగంలో పెరుగుతున్నాయి కాబట్టి డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు

