Salary: మీకు ఎంత జీతమైనా రానీ.. 50-30-20 ఫార్ములా ఫాలో అయితే బిందాస్‌గా బతకొచ్చు
Salary: ఈ రోజుల్లో మంచి జీతం రావడం ఒక్కటే సరిపోదు. వచ్చిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఇలా జీతం పడగానే అలా ఖర్చయిపోతున్నాయి. అయితే ఆర్థిక నిపుణులు సూచించే “50-30-20 రూల్” ద్వారా ఖర్చులు, పొదుపు, పెట్టుబడులను సమతుల్యం చేసుకోవచ్చు.

50-30-20 రూల్ అంటే ఏమిటి?
ఈ విధానంలో చేతికి వచ్చే జీతాన్ని మూడు భాగాలుగా విభజించాలి. మీకు వచ్చే మొత్తం జీతంలో 50 శాతాన్ని తప్పనిసరి ఖర్చులకు కేటాయించాలి. అదే విధంగా 30 శాతం వ్యక్తిగత అవసరాలు, లైఫ్ స్టైల్ ఖర్చులకు పక్కన పెట్టాలి. మిగతా 20 శాతం సేవింగ్స్, పెట్టుబడులకు కేటాయించాలి. అంటే నెలకు రూ.1 లక్ష జీతం వస్తే.. రూ.50,000 అవసరమైన ఖర్చులకు, రూ.30,000 వ్యక్తిగత ఖర్చులకు, రూ.20,000 సేవింగ్స్, SIPలు, పెట్టుబడులకు కేటాయించాలి. ఇలా ప్లాన్ చేస్తే డబ్బు ఎక్కడ ఖర్చవుతోందో స్పష్టంగా తెలుస్తుంది.

50 శాతం ఖర్చుల్లో ఏమేమి ఉండాలి?
ఈ భాగంలో తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చులు వస్తాయి. ఉదాహరణకు ఇంటి అద్దె, కరెంట్, నీటి బిల్లులు, కిరాణా సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, EMIలు. ఫైనాన్షియల్ ప్లానర్ల అభిప్రాయం ప్రకారం, అద్దె జీతంలో 25 నుంచి 30 శాతం మించకూడదు. అద్దె ఎక్కువైతే సేవింగ్స్ తగ్గిపోతాయి.
EMIలు ఎంతవరకు ఉండాలి?
ప్రస్తుతం చాలామంది హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్లతో EMIలు చెల్లిస్తున్నారు. కానీ జీతంలో ఎక్కువ భాగం EMIలకు వెళ్తే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. నిపుణుల ప్రకారం మొత్తం EMIలు నెల జీతంలో 30 నుంచి 40 శాతం లోపే ఉండాలి. లేదంటే అనుకోని వైద్య ఖర్చులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కొత్త లోన్ తీసుకునే ముందు EMI నిజంగా భరించగలమా లేదా అన్నది తప్పనిసరిగా ఆలోచించాలి.
SIP ఎందుకు అంత ముఖ్యమైంది?
దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవాలంటే ఎస్ఐపీ (Systematic Investment Plan) చాలా ఉపయోగకరమైన మార్గంగా భావిస్తారు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని SIPలో పెట్టుబడి పెడితే కంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. అంటే పెట్టుబడిపై వచ్చిన లాభం మళ్లీ పెట్టుబడిగా మారి భవిష్యత్తులో భారీ ఫండ్‌గా మారుతుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు నుంచే నెలకు రూ.5,000 SIP ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి కోట్ల రూపాయల ఫండ్ సృష్టించే అవకాశం ఉంటుంది.
ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ కూడా అవసరమే
పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు.. ఆర్థిక భద్రత కూడా చాలా ముఖ్యం. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. కనీసం 6 నెలల అవసరమైన ఖర్చులకు సరిపడా డబ్బు ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోవాలి. ఉద్యోగం పోయినా, ఆరోగ్య సమస్య వచ్చినా ఈ డబ్బు ఉపయోగపడుతుంది.
జీతం పెరిగితే సేవింగ్స్ కూడా పెంచాలి
చాలామంది జీతం పెరిగిన వెంటనే ఖర్చులు కూడా పెంచేస్తారు. దీనినే “లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్” అంటారు. ఆర్థిక నిపుణుల సలహా ఏమిటంటే.. జీతం పెరిగినప్పుడు SIPలు, సేవింగ్స్ కూడా పెంచాలి. పెట్టుబడులను ఆటో డెబిట్‌లో పెట్టుకుంటే ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సులభమవుతుంది.
ఈ ఫార్ములా వల్ల లాభం ఏమిటి?
50-30-20 రూల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ దీన్ని క్రమంగా పాటిస్తే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. సేవింగ్స్ పెరుగుతాయి, భవిష్యత్తు లక్ష్యాలు చేరుకోవడం సులభమవుతుంది, ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. చిన్న ప్లానింగ్‌తో పెద్ద ఆర్థిక భద్రత సాధించడానికి ఈ ఫార్ములా మంచి మార్గంగా చెప్పొచ్చు.

