RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్
RBI Economic Risks: ఆర్బీఐ రెపో రేటును 5.50%కి పెంచింది. క్రూడ్ ఆయిల్ నుండి ఎల్ నినో వరకు భారత ఎకానమీకి పొంచి ఉన్న 5 ప్రధాన ముప్పులపై ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.50 శాతానికి పెంపు.. అసలు కారణం ఏంటంటే?
భారత ఆర్థిక వ్యవస్థకు రాబోయే రోజుల్లో కొన్ని పెద్ద సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నుండి దేశంలో ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వరకు పలు అంశాలు మన ఎకానమీని దెబ్బతీసే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజాగా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.50 శాతానికి చేరింది. అంతేకాకుండా, ఆర్బీఐ తన పాలసీ వైఖరిని న్యూట్రల్ నుండి కాలిబ్రేటెడ్ టైటనింగ్ వైపు మార్చింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న 5 ప్రధాన ప్రమాదాలను స్పష్టంగా వివరించారు.
1. ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు
ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మన దేశానికి పెద్ద ముప్పుగా మారింది. మన దేశం అవసరమైన చమురులో సింహభాగం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల చమురు ధరలు పెరిగితే, అది నేరుగా దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు, పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతాయి. ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరిగే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
2. ఎల్ నినో ప్రభావం.. తగ్గిన వర్షపాతం
వ్యవసాయ రంగంపైనా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, దానితో పాటు తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటం వ్యవసాయంపై దెబ్బకొడుతోందని ఆర్బీఐ అభిప్రాయపడింది.
దీనివల్ల రాబోయే రబీ పంట కాలం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రకాల ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గి, అటు పట్టణాల్లో కూడా డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉంది.
3. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి
గ్లోబల్ మార్కెట్లలో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితులు కూడా భారత ఎకానమీకి ఆటంకంగ మారాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో బాండ్ ఈల్డ్స్ పెరగడం, అంతర్జాతీయ వ్యాపారంలో అనిశ్చితి నెలకొనడం, యూఎస్ డాలర్ విలువ బాగా బలపడటం వంటి అంశాలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా కఠినంగా మారితే, భారత్ లాంటి ఎదుగుతున్న దేశాల ఫైనాన్షియల్ సిస్టమ్‌పై ఆ ప్రభావం గట్టిగా పడుతుందని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
4. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. సప్లై చైన్ సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థల నడుము విరుస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ వాతావరణం, గ్లోబల్ సప్లై చైన్లలో తలెత్తుతున్న సమస్యలు వ్యాపార రంగానికి పెద్ద సవాలుగా మారాయి. అంతర్జాతీయ వ్యాపారంలో అడ్డంకులు, సరుకుల సరఫరాలో అంతరాయాలు మన దేశ ఆర్థిక వృద్ధికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.
5. పెరుగుతున్న సాధారణ ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం అనేది కేవలం కొన్ని వస్తువులకే పరిమితం కాకుండా, మార్కెట్‌లోని అన్ని రంగాలకు విస్తరించడం ఆర్బీఐని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆగస్టు నెల గణాంకాల ప్రకారం సిపిఐ బాస్కెట్‌లో ఉన్న సుమారు 37% వస్తువుల ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువ స్థాయి నమోదు చేసింది. కోర్ ఇన్ఫ్లేషన్ పెరగడంతో పాటు సాధారణ ద్రవ్యోల్బణ అంచనాలు కూడా పెరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఈ ప్రమాదకర సవాళ్లను సమర్థంగా అరికట్టడానికే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచి, పాలసీ కఠినతరం చేసే దిశగా అడుగులు వేసిందని పలువురు ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతినకుండా చూస్తూనే, ధరల పెరుగుదలను అదుపులోకి తీసుకురావడమే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

