PPF: 15 ఏళ్లలో రూ. 40 లక్షలు మీ సొంతం.. నెలకు ఎంత పొదుపు చేయాలంటే
PPF: సంపాదించే మొత్తంలో ఎంత కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. అయితే ఆ పొదుపు ఎక్కడ చేయాలన్న విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్‌కి గురవుతుంటారు. ప్రభుత్వ షూరిటీతో మంచి రిటర్న్స్ పొందే పథకంలో పీపీఎఫ్ ఒకటి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అంటే ఏంటి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది కేంద్ర ప్రభుత్వం మద్ధతుతో నడిచే దీర్ఘకాలిక సేవింగ్స్ పథకం. భద్రత, స్థిరమైన వడ్డీ, పన్ను మినహాయింపులు ఈ పథకం ప్రధాన ఆకర్షణలు. రిస్క్ లేకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ప్రస్తుతం FY 2025–26 నాలుగో త్రైమాసికానికి (జనవరి–మార్చి) PPF వడ్డీ రేటు 7.1 శాతంగా కొనసాగుతోంది.
PPF వడ్డీ రేటు, కాలపరిమితి
వడ్డీ రేటు: 7.1% సంవత్సరానికి (కంపౌండింగ్ పద్ధతిలో)
వడ్డీ జమ: ప్రతి సంవత్సరం మార్చి 31న
కాలపరిమితి: 15 సంవత్సరాలు
కనీస పెట్టుబడి: సంవత్సరానికి రూ.500
గరిష్ఠ పెట్టుబడి: సంవత్సరానికి రూ.1.5 లక్షలు
రిస్క్: లేదు (ప్రభుత్వ హామీ)
నెలలో 5వ తేదీ నుంచి చివరి తేదీ మధ్య ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు.
PPF అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
PPF ఖాతాను పోస్ట్ ఆఫీస్, SBI, PNB వంటి ప్రభుత్వ బ్యాంకులు, అలాగే HDFC, ICICI, Axis వంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో తెరవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు
* ఖాతా ఓపెనింగ్ ఫారం
* ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి KYC
* అడ్రస్ ప్రూఫ్
* నామినీ వివరాలు
* పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
* ఆన్‌లైన్ విధానం
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి, Open PPF Account ఎంపిక చేసి వివరాలు నమోదు చేస్తే ఖాతా వెంటనే ఓపెన్ అవుతుంది
నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది.?
మీరు నెలకు రూ.5,000 అంటే సంవత్సరానికి రూ.60,000 PPFలో పెట్టుబడి పెడతారు.
* కాలపరిమితి: 15 సంవత్సరాలు
* మొత్తం పెట్టుబడి: సుమారు రూ.9 లక్షలు
* అంచనా వడ్డీ రేటు: 7.1%
15 ఏళ్లకు వచ్చే మొత్తం (అంచనా): రూ.16.2 లక్షల వరకు. ఇది కంపౌండింగ్ ప్రభావం వల్ల సాధ్యమవుతుంది. దీర్ఘకాలంలో PPF బలమైన సంపదను సృష్టిస్తుంది.
PPF పన్ను ప్రయోజనాలు
పన్ను లాభాలు (EEE బెనిఫిట్) పెట్టుబడికి Section 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. వచ్చే వడ్డీపై పన్ను ఉండదు. మేచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. ఖాతా తెరిచిన 1 సంవత్సరం తర్వాత లోన్ సదుపాయం ఉంటుంది. గరిష్ఠంగా బ్యాలెన్స్‌లో 25% వరకు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత పార్ట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత పూర్తి ఉపసంహరణ ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం లేదా చదువు కోసం ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది.
గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే..
ఒకవేళ మీరు ప్రతి ఏడాది రూ.1.5 లక్షలు PPFలో పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం (ప్రస్తుత 7.1% వడ్డీ రేటు ఆధారంగా) ఇలా ఉంటుంది.
పెట్టుబడి వివరాలు:
* వార్షిక పెట్టుబడి: రూ.1,50,000
* కాలపరిమితి: 15 సంవత్సరాలు
* మొత్తం పెట్టుబడి: రూ.22,50,000
* వడ్డీ రేటు: 7.1% (కంపౌండింగ్)
15 ఏళ్లకు వచ్చే మొత్తం (అంచనా) సుమారు రూ.40 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు లభిస్తుంది. అంటే మీరు పెట్టిన డబ్బు రూ. 22.5 లక్షలు అయితే వడ్డీ ద్వారా వచ్చే లాభం సుమారు రూ.18 లక్షలు అవుతుంది.

