- Home
- Business
- Post office: ఇలా చేస్తే మీ డబ్బులు గుడ్లు పెట్టడం ఖాయం.. 5 ఏళ్లలో రూ. 2.2 లక్షల వడ్డీ
Post office: ఇలా చేస్తే మీ డబ్బులు గుడ్లు పెట్టడం ఖాయం.. 5 ఏళ్లలో రూ. 2.2 లక్షల వడ్డీ
Post office: పెట్టిన పెట్టుబడికి భద్రతతో పాటు మంచి వడ్డీ కావాలనుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ హామీతో ఉండే ఈ పథకం సురక్షిత పెట్టుబడిగా చెప్పొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అంటే ఏమిటి?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది నిర్దిష్ట కాలానికి ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టి వడ్డీతో తిరిగి పొందే పథకం. ఇది బ్యాంక్ FD తరహాలోనే పనిచేస్తుంది. ఈ పథకంలో మీరు కనీసం రూ.1,000తో అకౌంట్ ప్రారంభించవచ్చు. గరిష్ఠ పరిమితి లేకపోవడం వల్ల చిన్న పెట్టుబడిదారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరికీ ఇది అనుకూలం. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్‌గా కూడా తెరవవచ్చు.
వడ్డీ రేట్లు, కాలపరిమితి
పోస్ట్ ఆఫీస్ FDలో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాలపరిమితి ఆధారంగా సుమారు 6.9% నుంచి 7.5% వరకు వడ్డీ లభిస్తుంది.
* 1 సంవత్సరం – సుమారు 6.9%
* 2 సంవత్సరాలు – సుమారు 7.0%
* 3 సంవత్సరాలు – సుమారు 7.1%
* 5 సంవత్సరాలు – సుమారు 7.5%
ఈ పథకంలో 5 సంవత్సరాల కాలపరిమితి పెట్టుబడికి అత్యధిక వడ్డీ లభిస్తుంది.
రూ.1 లక్ష పెట్టుబడిపై మెచ్యూరిటీ మొత్తం
మీరు 5 సంవత్సరాల కాలానికి రూ.1,00,000 పెట్టుబడి పెడితే 7.5% వార్షిక వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.1,44,995 వస్తాయి. అంటే మొత్తం వడ్డీ సుమారు రూ.44,995 వరకు లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది.
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
అదే 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ FDలో రూ.5,00,000 పెట్టుబడి పెడితే 7.5% వడ్డీ రేటుతో మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ.7,24,975 వరకు పెరుగుతుంది. మొత్తం పెట్టుబడి: రూ.5,00,000 పెడితే వడ్డీ రూపంలోనే సుమారు రూ. 2,24,975 పొందొచ్చు. ఇలా మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 7,24,975 పొందొచ్చు.
సురక్షిత పెట్టుబడి
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందువల్ల పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ మార్పులతో సంబంధం లేకుండా ముందే నిర్ణయించిన వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారే అవకాశం ఉన్నా పోస్టాఫీస్ పథకాలలో అందరికీ ఒకే రేటు వర్తిస్తుంది. భద్రత, స్థిరమైన ఆదాయం, సరళమైన విధానం కారణంగా పోస్ట్ ఆఫీస్ FDను చాలామంది పెట్టుబడిదారులు నమ్మకంగా ఎంపిక చేస్తున్నారు.

