- Home
- Business
- Post office: జీరో రిస్క్, గ్యారెంటీ రిటర్న్స్.. రూ. లక్ష పెట్టుబడిపై రూ. 23 వేల వడ్డీ
Post office: జీరో రిస్క్, గ్యారెంటీ రిటర్న్స్.. రూ. లక్ష పెట్టుబడిపై రూ. 23 వేల వడ్డీ
Post office: డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఎంపికగా మారుతోంది. బ్యాంక్ FDల కంటే ఎక్కువ వడ్డీ, 100% ప్రభుత్వ హామీ ఈ స్కీమ్ ప్రత్యేకత. కేవలం రూ. 1,000తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?
పోస్టాఫీస్ అందిస్తున్న టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో మీరు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. నిర్ణీత కాలానికి ఫిక్స్‌డ్ వడ్డీ లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులు ప్రభావం చూపవు కాబట్టి ఇది సురక్షిత పెట్టుబడి పథకంగా భావిస్తున్నారు. ఈ స్కీమ్‌లో వ్యక్తిగత ఖాతా లేదా జాయింట్ అకౌంట్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు.

వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే.?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.
* 1 సంవత్సరం డిపాజిట్‌పై – 6.9%
* 2 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.0%
* 3 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.1%
* 5 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.5% వడ్డీ పొందొచ్చు.
ముఖ్యంగా 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.5% వడ్డీ అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఇలాంటి అధిక వడ్డీని సీనియర్ సిటిజన్లకే ఇస్తాయి.
రూ. 1 లక్ష పెట్టుబడిపై ఎంత వస్తుంది?
ఈ స్కీమ్‌లో మీరు రూ. 1,00,000ను 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 1,23,508 వస్తుంది. అంటే రూ. 23,508 వడ్డీ రూపంలో లాభం పొందవచ్చు. ఇది పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడి. మీ డబ్బుకు ప్రభుత్వ హామీ ఉండటంతో నష్టపోయే అవకాశం ఉండదు.
చిన్న మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభం
ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి కేవలం రూ. 1,000 మాత్రమే. గరిష్ట పరిమితి లేదు. అందువల్ల చిన్న మొత్తంతో మొదలుపెట్టి పెద్ద మొత్తాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే అవసరం అయితే 6 నెలల తర్వాత ప్రీమేచ్యూర్ విత్‌డ్రా సదుపాయం కూడా ఉంది. అయితే ముందుగానే డబ్బు తీసుకుంటే కొంత తక్కువ వడ్డీ వర్తించే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్‌కు ఎందుకు డిమాండ్ పెరుగుతోంది?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ స్థిరమైన రాబడిని అందించే సురక్షిత మార్గంగా మారింది. ఈ స్కీమ్‌తో ప్రధానంగా 100% ప్రభుత్వ భద్రత, బ్యాంక్ FDల కంటే ఎక్కువ వడ్డీ, రూ. 1,000తోనే ప్రారంభం, 1 నుంచి 5 సంవత్సరాల పెట్టుబడి ఎంపిక, 5 సంవత్సరాల TDపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

