FASTag మంథ్లీ పాస్ ఎలా తీసుకోవాలి.? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
FASTag: ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ఆఫీస్, వ్యాపారం లేదా ఇతర పనుల కోసం ప్రయాణించే వారికి ఫాస్టాగ్ మంథ్లీ పాస్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రతి సారి టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకసారి నిర్దిష్ట మొత్తం చెల్లిస్తే సరిపోతుంది.

ఫాస్టాగ్ మంథ్లీ పాస్ అంటే ఏంటి.?
ఫాస్టాగ్ మంథ్లీ పాస్ అనేది ముందస్తుగా చెల్లించే టోల్ సౌకర్యం. ఇందులో ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన తర్వాత, ఒక నిర్దిష్ట టోల్ ప్లాజా ద్వారా నెల రోజుల పాటు ప్రయాణించవచ్చు. దీంతో ప్రతిసారి టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ పాస్ సాధారణంగా ఒక నెలపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే టోల్ ప్లాజా నిబంధనలను బట్టి కొన్ని చోట్ల అన్‌లిమిటెడ్ ప్రయాణాలు చేసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల పరిమిత సంఖ్యలో ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఉండవచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
FASTag Monthly Pass ముఖ్యంగా తరచుగా ఒకే మార్గంలో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో నివసించే స్థానికులు, చిన్న వ్యాపారులు, వాణిజ్య వాహనాల డ్రైవర్లు, ప్రతిరోజూ ఒకే టోల్ మార్గాన్ని ఉపయోగించే ప్రయాణికులు లాంటి వారు నెలవారీ పాస్ తీసుకోవడం ద్వారా టోల్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో పాస్ ఎలా పొందాలి?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇష్టపడని వారు నేరుగా సంబంధిత టోల్ ప్లాజాకు వెళ్లి కూడా మంత్లీ పాస్ పొందవచ్చు. అక్కడ అవసరమైన వాహన వివరాలు సమర్పించి, నిర్ణీత రుసుము చెల్లిస్తే పాస్ జారీ చేస్తారు. పాస్ ధర, ప్రయాణాల సంఖ్య, ఇతర నిబంధనలు టోల్ ప్లాజా లేదా FASTag జారీ చేసిన బ్యాంకును బట్టి మారవచ్చు.
ఆన్‌లైన్‌లో FASTag Monthly Pass ఎలా కొనుగోలు చేయాలి?
ఇంట్లో నుంచే సులభంగా FASTag Monthly Pass పొందవచ్చు. ఇందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
* ముందుగా IHMCL వెబ్‌సైట్‌లోకి వెళ్లి "Buy Monthly FASTag Pass" ఎంపికను ఎంచుకోవాలి.
* మీరు ఉపయోగించే టోల్ ప్లాజాను ఎంపిక చేసి, CAPTCHA ధృవీకరణ పూర్తి చేయాలి.
* ఆ తర్వాత బ్యాంక్ పేజీకి వెళ్లి FASTag Tag ID లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) నమోదు చేయాలి.
* మీకు అవసరమైన పాస్ రకం, ప్లాన్‌ను ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయాలి.
* చెల్లింపు పూర్తైన తర్వాత రసీదు జనరేట్ అవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.
మంథ్లీ పాస్‌కి, యాన్యువల్ పాస్‌కి మధ్య తేడా ఏంటి.?
NHAI ఇటీవల ప్రవేశపెట్టిన FASTag Annual Pass ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారి కోసం రూపొందించారు. దీని ధర రూ.3,075. ఇందులో 200 ప్రయాణాలు లేదా ఒక సంవత్సరం చెల్లుబాటు లభిస్తుంది. అయితే FASTag Monthly Pass మాత్రం ఒక నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే వర్తిస్తుంది. స్థానికంగా తరచూ ప్రయాణించే వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. నెలవారీ చెల్లింపుతో తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం కల్పిస్తుంది.
ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే వారు FASTag Monthly Pass తీసుకుంటే ప్రతి సారి టోల్ చెల్లించే ఇబ్బంది ఉండదు. అలాగే టోల్ ఖర్చు కూడా తగ్గుతుంది. టోల్ బూత్ వద్ద ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఉద్యోగులు, వ్యాపారులు, స్థానిక ప్రయాణికులు వంటి వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటే ప్రయాణం మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో సాగుతుంది.

