- Home
- Business
- మైనర్ బైక్ నడిపితే రూ.25,000, మందు తాగి డ్రైవ్ చేస్తే రూ.10,000: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై రూ.వేలల్లోనే ఫైన్
మైనర్ బైక్ నడిపితే రూ.25,000, మందు తాగి డ్రైవ్ చేస్తే రూ.10,000: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై రూ.వేలల్లోనే ఫైన్
‘భరత్ అనే నేను’ అనే సినిమా మీరు చూశారా? అందులో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.వేలల్లో ఫైన్ వేసిన సీన్ గుర్తుందా? ఇప్పుడు ఇండియాలో అలాంటి కఠినమైన నియమాలు అమలులోకి వచ్చాయి. ఇకపై సిగ్నల్ జంప్ చేసినా కూడా రూ.వేలల్లో ఫైన్ వేస్తారు.

రూల్స్ పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం
మన దేశంలో నిర్లక్ష్యం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ని అమలుచేయాలని నిర్ణయించింది.
అతివేగం, మద్యం తాగి డ్రైవ్ చేయడం, పిల్లలు వెహికల్స్ నడపడం, సిగ్నల్స్ క్రాస్ చేయడం ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే చలానాలు భారీగా పెంచింది. ముఖ్యంగా మైనర్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నామని అధికారులు గుర్తించారు.
రూల్స్ పాటించకపోతే ఫైన్ రూ.వేలల్లోనే..
రోడ్డు ప్రమాదాల వల్ల ఈజీగా ప్రాణాలు పోతున్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమవుతోంది. కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఆ కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
కొత్త రూల్స్ ప్రకారం శిక్షలు ఎలా ఉన్నాయంటే..
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే వారికి రూ.10,000 జరిమానా విధిస్తారు. లేదా ఆరు నెలల జైలు శిక్ష వేస్తారు.
ఇదేవిధంగా రెండో సారి దొరికితే రూ.15,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.
రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే ఇప్పటి వరకు రూ.500 ఫైన్ వేసేవారు. ఇ-చలానా ఫోన్ కి లేదా మొయిల్ కి వచ్చేది. ఇకపై రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే రూ.5,000 ఫైన్ కట్టాలి.
స్పీడ్ లిమిట్ దాటినా రూ.5,000 ఫైన్
రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిటేషన్స్ కనిపిస్తాయి. వాటిని పాటిస్తూ ప్రయాణం చేస్తే సేఫ్ గా గమ్యస్థానం చేరుకోవచ్చు. వాటిని అతిక్రమించే డ్రైవర్లకు కూడా ఇకపై ఫైన్ వేయనున్నారు. అది రూ.వందల్లో కాకుండా ఏకంగా రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు.
అదేవిధంగా అధిక బరువుతో వెళ్లే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ యజమానులకు రూ.20,000 కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఇప్పుడు ఏకంగా రూ.5,000 ఫైన్ కట్టాల్సిందే. అయితే మీరు గాని డిజీ లాకర్, ఎంపరివాహన్ లాంటి యాప్‌లోని డిజిటల్ కాపీలు చూపిస్తే మీరు ఎలాంటి ఫైన్ కట్టాల్సిన పని లేదు.
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా రూ.10,000
హెల్మెట్, సీట్ బెల్ట్ ఏం పెట్టుకుంటాం లే అని చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. కాని ప్రమాదం జరిగినప్పుడు అవే మన ప్రాణాలు కాపాడతాయన్న విషయాన్ని ఎవరూ గుర్తించరు. అందుకే ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా రూ.1,000 ఫైన్ వేస్తారు. అంతే కాకుండా 3 నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తారు.
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా, అసలు తీసుకోకపోయినా రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా సామాజిక సేవ చేయాలని డ్యూటీ కూడా వేస్తారు.
మైనర్ డ్రైవింగ్ చేస్తే జైలే..
మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే బండి యజమానికి రూ.25,000 ఫైన్ వేస్తారు. అంతేకాకుండా అతను 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. దీంతో పాటు అతని వాహన రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు రద్దు అవుతుంది.
ఇదే సంఘటనలో మైనర్ 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా నిషేధం విధిస్తారు.
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.