బంగారం, వెండి, రాగితో పాటు పరుగులు పెడుతోన్న మరో మెటల్.. ఇక భవిష్యత్ అంతా దీనిదే
Lithium Price: బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి తోడు రాగి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కాగా ఇప్పుడు మరో మెటల్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. ఇంతకీ ఆ మెటల్ ఏంటంటే..

బంగారంతో పాటు పెరుగుతోన్న ఇతర లోహాల ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న వేళ.. ఇతర లోహాలపైనా పెట్టుబడిదారుల దృష్టి పడుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు గణనీయంగా ఎగబాకగా, తాజాగా రాగి విలువ కూడా వేగంగా పెరిగింది. ఇప్పుడు అదే జాబితాలో లిథియం చేరడం విశేషం. గ్లోబల్ మార్కెట్లలో లిథియం డిమాండ్ ఒక్కసారిగా పెరగడం ఈ లోహాన్ని కీలకంగా మార్చింది.
భారత్‌లో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం
భారతదేశంలో బంగారం కేవలం లోహం కాదు. సంప్రదాయం, ఆచారం, భద్రత అనే భావనలతో ముడిపడి ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, ఆర్థిక అవసరాల సమయంలో గోల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. ఈ కారణంతోనే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది.
లిథియం ఎందుకు అంత విలువైన లోహంగా మారింది?
ఇప్పటి ఆధునిక ప్రపంచంలో లిథియం అవసరం భారీగా పెరిగింది. బ్యాటరీల తయారీలో ఇది ప్రధాన భాగం. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి పరికరాల్లో లిథియం వినియోగం తప్పనిసరి అయింది. క్లిన్ ఎనర్జీ రంగంలోనూ దీని పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఈ కారణంగా లిథియంపై పెట్టుబడులు పెట్టే వారి ఆసక్తి కూడా ఎక్కువవుతోంది.
లిథియం బ్యాటరీలకు ఉన్న ప్రత్యేకత
సాధారణ బ్యాటరీలతో పోలిస్తే లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేస్తాయి. ఛార్జింగ్ వేగంగా పూర్తవుతుంది. తక్కువ బరువుతో అధిక పనితీరు అందిస్తాయి. ఈ లక్షణాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో లిథియం బ్యాటరీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాబోయే కాలంలో ఈవీ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున లిథియం డిమాండ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రపంచ లిథియం నిల్వలు.. భారత్ పరిస్థితి ఏంటి?
ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశంగా ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. ఆ తర్వాత చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. భారత్‌లో లిథియం నిల్వలు పరిమితంగానే ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ ప్రాంతాల్లో కొంతమేర లభ్యమవుతున్నాయి. భవిష్యత్తులో దేశీయ అవసరాలు పెరిగితే లిథియం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

