Farming: ఈ పంటలకు అర ఎకరం భూమి చాలు.. బంగారం పండించవచ్చు!
భూమి ఎంత ఉంది అన్నది విషయం కాదు.. లాభాల పంట పండించామా లేదా అనేదే ముఖ్యం. తెలివిగా ఆలోచిస్తే తక్కువ విస్తీర్ణంలోనూ ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండించవచ్చు. మరి ఏ పంటలు వేస్తే లాభాల వర్షం కురుస్తుందో ఇక్కడ చూద్దాం.

అర ఎకరం భూముంటే చాలు..
ప్రస్తుతం ఎకరాల కొద్దీ పంటలు పండించినా.. ఏం మిగలని పరిస్థితి. పెట్టే పెట్టుబడికి, వచ్చే రాబడికి అసలు సంబంధం లేకుండా పోతోంది. దానివల్ల రైతులు ఏటా నష్టపోవాల్సి వస్తోంది. కానీ కొంతమంది రైతులు తక్కువ భూమిలోనూ ఎంపిక చేసిన పంటలు వేస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు.
వ్యవసాయ నిపుణుల ప్రకారం కొన్ని పంటలు సాగుచేయడానికి ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉండాల్సిన అవసరం లేదు. అర ఎకరం భూముంటే చాలు. లాభాల పంటలు పండించవచ్చు. అందుకు అధిక దిగుబడిని ఇచ్చే పంటలను ఎంచుకోవడం ముఖ్యం. మరి ఏ పంటలు లాభాలు కురిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
పూల సాగు
తక్కువ భూమిలో సాగు చేసే పంటల్లో పూలసాగు ముందు వరుసలో ఉంటుంది. ఈ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందవచ్చు. అర ఎకరం భూమిలో బంతి, చామంతి, గులాబీ వంటి పూలను సాగు చేయవచ్చు. పైగా పంట మార్పిడి ద్వారా భూమి కూడా సారవంతంగా మారుతుంది. దిగుబడి కూడా పెరుగుతుంది. పూలసాగు.. పంటను బట్టి 2 నుంచి 6 నెలల లోపు పూర్తవుతుంది.
సహజ ఎరువుల వాడకం
పూల సాగుకు సహజ ఎరువులు వాడటం ద్వారా పంటల నాణ్యతను పెంచుకోవచ్చు. వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవడం ద్వారా మంచి దిగుబడి కూడా పొందవచ్చు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పువ్వులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
వాణిజ్యపరంగా..
వాణిజ్యపరంగా కూడా పువ్వుల సాగు చాలా పంటల కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పూల ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు.
అంతేకాదు పువ్వులను వివిధ రకాలుగా విలువ జోడించి అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. పువ్వులను గిఫ్ట్ బొకెలుగా అమ్మడం లేదా పువ్వులతో ఇతర అలంకరణ వస్తువులు తయారు చేసి అమ్మడం వంటివి చేయవచ్చు.
సాగు పద్ధతులు:
సాంప్రదాయ పద్ధతులతో పాటు, ఆధునిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. గ్రీన్ హౌస్ సాగు, హైడ్రోపోనిక్స్ వంటి పద్ధతులు కూడా ఉపయోగించవచ్చు. పూల సాగులో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. చీడపీడలు, వాతావరణ మార్పులు పూలసాగుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
పెట్టుబడి ఎంతంటే?
వ్యవసాయ నిపుణుల ప్రకారం.. బంతి పూల సాగుకు అర ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం లభిస్తుంది. గులాబీ సాగుతో కూడా రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. గులాబీ సాగుకు 50వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లక్షన్నర వరకు ఆదాయం రావచ్చు.
మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా..
సరైన ప్రణాళిక, ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించడం ద్వారా పూల సాగును లాభదాయకంగా మార్చుకోవచ్చు. అయితే రైతులు పూల పంటలు వేయాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన మార్కెట్ డిమాండ్, ధరలను తెలుసుకోవాలి. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా సాగు చేపట్టడం మంచిది.