Gold: మాకు బంగారం అంటే ప్రాణం.. అక్షయ తృతీయ రోజున ఎంత గోల్డ్ కొన్నారో తెలుసా?
బంగారం అంటే కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఇంట్లో బంగారం ఉంటే అదో ధీమా. అందుకే చాలా మంది బంగారాన్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేము. సాధారణ రోజుల్లోనే బంగారాన్ని తెగ కొంటుంటారు. అలాంటిది అక్షయ తృతీయ రోజు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు జరిగాయి.

akshay tritiya 2025
అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు రూ. 12,000 కోట్లకు చేరుకున్నాయని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) పేర్కొంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, పెళ్లి సీజన్, అక్షయ తృతీయకు ఉన్న పవిత్రత కారణంగా ప్రజలు భారీగా బంగారం కొనుగోళ్లు చేశారు.
CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకారం, బంగారం ఆభరణాలతో పాటు ఇతర వస్తువుల అమ్మకాలు రూ. 12,000 కోట్లకు చేరగా, వెండి అమ్మకాలు సుమారు రూ. 4,000 కోట్లుగా అంచా వేశారు.
ఆల్ ఇండియా జ్యూవెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపిన వివరాల ప్రకారం. గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,500గా ఉంది. వెండి ధర కిలోకి రూ. 98,000కి చేరింది.
2022లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,700, వెండి కిలో ధర రూ. 65,000 ఉండగా, 2023లో బంగారం రూ. 61,800, వెండి రూ. 76,500కి చేరింది. 2024లో బంగారం రూ. 74,900కి చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం, 2025 జనవరి మార్చిలో దేశంలో బంగారం డిమాండ్ 118.1 టన్నులుగా నమోదైంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% తగ్గింది. కానీ, బంగారం ధరలు 25% పెరిగిన కారణంగా మొత్తం డిమాండ్ విలువలో 22% వృద్ధి చోటు చేసుకుంది.
Gold Price
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా CEO సచిన్ జైన్ ప్రకారం, బంగారం ధర 10 గ్రాములకు లక్షను తాకడంతో ప్రజల ఆసక్తి మరింత పెరిగింది. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు, నాణేలు, బార్లపై పెట్టుబడులపై ఆసక్తి పెరిగిందన్నారు. అక్షయ తృతీయతో పాటు పెళ్లి సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లపై మరింత ఉత్సాహం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో బంగారం డాలర్ల విక్రయాలు
అక్షయ తృతీయ రోజు రికార్డుస్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. బుధవారం ఒక్క రోజే టీటీడీ ఏకంగా రూ. 90 లక్షల విలువైన బంగార డాలర్లను విక్రయించింది. ఇదిలా ఉంటే గతేడాది అక్షయతృతీయ రోజు రూ. 75 లక్షల విలువైన బంగారు డాలర్ల విక్రయాలు జరిగాయి.