ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పబోతోంది. EPS పెన్షన్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై కనీస పెన్షన్‌ను రూ.1,000 నుండి ఏకంగా రూ.3,000కి పెరుగుతుంది. దీనివల్ల 36.6 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద కనీస పెన్షన్ ప్రస్తుతం రూ.1,000 ఇస్తున్నారు. దీన్ని ఏకంగా రూ.3,000 కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై మరికొన్ని నెలల్లోనే క్లారిటీ వస్తుందని సమాచారం. ద్రవ్యోల్బణం, వృద్ధులకు సామాజిక భద్రత కల్పించడంలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పెన్షన్ పెంచాలని కేంద్రం ఆలోచన చేస్తోంది.
అసలు EPS అంటే ఏమిటి?
EPS అనేది భారతదేశంలోని ప్రైవేటు రంగ ఉద్యోగుల కోసం ఒక పెన్షన్ పథకం. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించడం దీని లక్ష్యం. ఈ పథకానికి నిధులు యజమాని సహకారం నుండి.. అంటే కంపెనీ నుండి వస్తాయి. EPF (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు మొత్తం 12% సహకారంలో 8.33 % EPS కి, మిగిలిన 3.67% EPF కి వెళ్తాయి.
36.6 లక్షల మందికి లబ్ధి..
2025 బడ్జెట్‌కు ముందు చర్చ సందర్భంగా EPS రిటైర్డ్ ఉద్యోగుల బృందం కనీస పెన్షన్‌ను రూ. 7,500కి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించింది. కానీ వారికి ఎటువంటి హామీ లభించలేదు.
ప్రస్తుతం EPS మొత్తం నిధులు రూ. 8 లక్షల కోట్లు. ఈ పథకం కింద దాదాపు 78.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 36.6 లక్షల మందికి కనీస పెన్షన్ రూ. నెలకు 1,000. ఈ ప్రపోజల్ ఓకే అయితే వీళ్లందరికీ లబ్ధి చేకూరుతుంది.
ఆర్థిక ప్రభావం గురించి చర్చ...
రూ.3,000 పెన్షన్ అమలుకు సంబంధించిన అదనపు ఖర్చును కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అంచనా వేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో EPS పెన్షనర్లకు కనీస పెన్షన్ అందించడానికి ప్రభుత్వం రూ.1,223 కోట్లు ఖర్చు చేసింది. ఇది FY23లో ఖర్చు చేసిన రూ.970 కోట్ల కంటే 26 % ఎక్కువ.
సెప్టెంబర్ 2014 నుండి ప్రభుత్వం కనీస పెన్షన్ రూ.1000/- చెల్లించేలా సబ్సిడీని అందిస్తోంది.