ఇంకా రెండు రోజులే.. ఈ నెలాఖరులోపు ఈ పనులు కచ్చితంగా చేయాల్సిందే. లేదంటే చాలా లాస్
Financial Deadlines: నవంబర్ నెలాఖరుకు వచ్చేసింది. ఈ నెలాఖరులోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తిచేయకపోతే పెన్షన్ నిలిపివేయడం నుంచి బ్యాంకు సేవలు నిలిచిపోవడం వరకు పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ తప్పనిసరి
ప్రతి సంవత్సరం పెన్షన్ సదుపాయం కొనసాగేందుకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. 80 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వరకూ ప్రత్యేక గడువు ఇచ్చారు. సర్టిఫికేట్‌ను బ్యాంక్ బ్రాంచుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, CSC కేంద్రాలు, మొబైల్ యాప్ / జీమెయిల్ ఆధారిత డిజిటల్ జేవన్ ప్రామాణ్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇంటి వద్ద సేవ వద్ద సమర్పించవచ్చు. ఈ గడువులోపు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ జమ కాకపోవచ్చు.
టాక్స్ ఫైలింగ్స్
పన్ను చెల్లింపుదారులకు నవంబర్ కీలకం. అక్టోబర్ 2025కి సంబంధించిన పలు TDS సంబంధిత స్టేట్‌మెంట్‌లకు ఇదే చివరి తేదీ. ఇందులో భాగంగా సెక్షన్లు 194-IA, 194-IB, 194M, 194S ప్రకారం చలనా -కమ్-స్టేట్‌మెంట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యం జరిగితే లేట్ ఫీజులు, జరిమానాలు, నోటీసులు రావచ్చు.
UPS ఎంపికకు చివరి అవకాశం
కేంద్ర ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఎంచుకునేందుకు నవంబర్ 30 తుది గడువు. ముందుగా సెప్టెంబర్‌లో ముగియాల్సిన ఈ గడువును ఉద్యోగుల సౌలభ్యం కోసం పెంచారు. UPSలో ఉద్యోగి బేసిక్ జీతం + డీఆర్‌లో 10% చెల్లించాలి. ప్రభుత్వం 18.5% వాటా కల్పిస్తుంది. ఇది పాత పెన్షన్ విధానానికి భిన్నంగా ఉంటుంది. UPSలో చేరాలనుకునే వారు ఈ వారంలోపే ఆన్‌లైన్ లేదా శాఖ స్థాయి ప్రక్రియను పూర్తి చేయడం అత్యంత అవసరం.
పీఎన్‌బీ కస్టమర్లకు అలర్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు సూచన చేసింది. నవంబర్ 30 లోపు e-KYC పూర్తి చేయకపోతే ఖాతా ఆపరేషన్లు నిలిపివేస్తారు. ఈ కేవైసీ చేసుకోకపోతే.. డబ్బు విత్‌డ్రా, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలు మొత్తం బ్లాక్ అవుతాయి. మీ అకౌంట్ కంటిన్యూ అవ్వాలంటే బ్రాంచ్‌ను సంప్రదించి e-KYC వెంటనే పూర్తిచేయాలి.
ఈ పనులు చేయకపోతే ఎదురయ్యే సమస్యలు
* పెన్షన్ నిలిపివేత
* ఆదాయపు పన్ను జరిమానాలు
* బ్యాంకు ఖాతా తాత్కాలికంగా బ్లాక్
* ట్యాక్స్ ఫైలింగ్ ఆలస్యం
* ఆర్థిక కార్యకలాపాల్లో ఆటంకం

