AI దెబ్బ.. అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలు ఊస్టింగ్
Amazon Layoffs : అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ విభాగంలో 14,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ ధృవీకరించింది. ఏఐ పెట్టుబడులకు అనుగుణంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని అమెజాన్ తెలిపింది.

అమెజాన్ లో భారీగా ఉద్యోగాల కోత
అమెజాన్ తన ప్రపంచ కార్పొరేట్ విభాగంలో సుమారు 14,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తక్కువ స్థాయి వ్యవస్థలో మరింత వేగంగా పనిచేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో 30,000 ఉద్యోగ కోతల వార్తలు వచ్చినా, తాజాగా ఆ సంఖ్య 14,000 అని స్పష్టం చేసింది.
ఈ ప్రకటనను అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి మంగళవారం ఉద్యోగులకు పంపిన సందేశంలో వెల్లడించారు. ఏఐ అభివృద్ధి వేగం పెరగడంతో సంస్థ పునర్‌వ్యవస్థీకరణ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
అమెజాన్ ఉద్యోగాల కోతకు కారణం ఏమిటి?
బెత్ గాలెట్టి ప్రకారం, గత సంవత్సరం అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ సంస్థ సంస్కృతిని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా వ్యవహరించాలన్న లక్ష్యంతో, వేగం, బాధ్యత, కనెక్టివిటీ పెంచేందుకు నిర్మాణంలో మార్పులు అవసరమని చెప్పారు.
ఇంటర్నెట్ తరవాత ఏఐ అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీగా మారింది. కంపెనీలు వేగంగా ఆవిష్కరణలు చేస్తుండటం వల్ల సంస్థ అత్యవసరమైన పదవులు, బృందాలు, నిర్ణయ స్థాయిలు మాత్రమే ఉండే విధంగా సంస్థ నిర్మాణాన్ని సరళీకరించడం వంటి నిర్ణయాలతో ముందుకు సాగాలని ఆండ్రూ జస్సీ అభిప్రాయపడ్డారు.
తొలగించిన ఉద్యోగులకు చట్టాలకు అనుగుణంగా సాయం
ఉద్యోగ కోతలకు గురైనవారికి అమెజాన్ 90 రోజుల పీరియడ్ లో అంతర్గతంగా కొత్త ఉద్యోగాల కోసం అవకాశం ఇస్తోంది. స్థానిక చట్టాలకు అనుగుణంగా ఈ గడువు మారవచ్చు. కొత్త ఉద్యోగం దొరకని ఉద్యోగులకు సేవరెన్స్ పే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
అమెజాన్‌లో గిడ్డంగులు, కార్యాలయాలతో కలిపి 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్ ఈ విభాగంలో 4% సిబ్బందిపై ప్రభావం చూపనున్నాయి.
గతంలోనూ ఉద్యోగులను తొలగించిన అమెజాన్
2022–23 మధ్య అమెజాన్ సుమారు 27,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది. డిమాండ్ పెరిగిన కోవిడ్ సమయంలో భారీగా నియామకాలు చేసిన తర్వాత, ఖర్చులను తగ్గించడంపై ఆండీ జస్సీ దృష్టి పెట్టారు. 2024 జూలైలో ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అమ్మకాలు 13% పెరిగి $167.7 బిలియన్‌కు చేరాయి. వ్యాపార ప్రదర్శన బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ పెట్టుబడుల కోసం ఖర్చులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సంస్థ చెబుతోంది.
కొత్త ఏఐ సాధనాలు రావడంతో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో ఉద్యోగుల అవసరం తగ్గుతుందని అనలిస్టులు పేర్కొన్నారు.
అమెజాన్ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
అమెజాన్ 2026 వరకు కీలక వ్యూహాత్మక విభాగాల్లో నియామకాలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అలాగే, నిర్వాహక స్థాయిలు తగ్గింపు, నిర్వహణ వేగం పెంపు, ఖర్చుల నియంత్రణలు కొనసాగనున్నాయి. ఆండ్రూ జస్సీ ప్రకారం.. “ఇప్పటి ఉద్యోగాల్లో కొన్నింటికి భవిష్యత్తులో తక్కువ మనుషులు సరిపోవచ్చు. ఏఐ కారణంగా కొత్త రకాల ఉద్యోగాలు మాత్రం పెరుగుతాయి.” కాగా, అమెజాన్ త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది.