EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనతో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఇకపై ఎలాంటి ఫారాలు నింపకుండానే యూపీఐ ద్వారా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు సులభంగా, క్షణాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అదిరిపోయే న్యూస్.. పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం ఇక మంచినీళ్లు తాగినంత ఈజీ!
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. పీఎఫ్ (PF) ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులకు ఎంతగానో ఉపశమనం కలిగించనుంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే పాటించాల్సిన సుదీర్ఘ ప్రక్రియకు ఈపీఎఫ్‌వో వీడ్కోలు పలికింది.
ఇకపై ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి పెద్ద పెద్ద ఫారాలు నింపాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్లిష్టమైన ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సిన పనిలేదు. నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా తమ డబ్బును తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది.
ఎన్‌పీసీఐతో కీలక ఒప్పందం.. యూపీఐ సేవలు షురూ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీసుకున్న ఈ నిర్ణయం పీఎఫ్ విత్‌డ్రా విధానంలో విప్లవం సృష్టించిందని చెప్పవచ్చు. సాధారణంగా పీఎఫ్ అప్లై చేసిన తర్వాత డబ్బులు ఖాతాలో జమ కావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పట్టేది. కానీ, తాజా నిబంధనల ప్రకారం ఇకపై రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సెకన్లలోనే ఫండ్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది.
ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడానికి ఈపీఎఫ్‌వో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రాథమికంగా ఈ సేవలు భీమ్ యూపీఐ (BHIM UPI) ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత దశలవారీగా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర ప్రముఖ యూపీఐ యాప్‌ల ద్వారా కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ఈ నిర్ణయం అత్యవసర సమయంలో డబ్బు అవసరమయ్యే కోట్లాది మంది పీఎఫ్ చందాదారుల జీవితాలను సులభతరం చేయనుంది.
EPFO : పీఎఫ్ విత్‌డ్రా పాత పద్ధతిలో ఉన్న ఇబ్బందులు ఏంటి?
గతంలో పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. ఉద్యోగులు డబ్బులు తీసుకోవాలంటే రకరకాల ఫారాలు నింపాల్సి వచ్చేది. కేవలం ఫారాలు నింపడమే కాకుండా, బ్యాంకు వెరిఫికేషన్, ఇతర అంచెల వారీగా జరిగే తనిఖీలు పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టేది.
ఈ ప్రక్రియలో జరిగే జాప్యం వల్ల, అత్యవసరంగా డబ్బు కావాల్సిన ఉద్యోగులు వారాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు చిన్న చిన్న సాంకేతిక కారణాలతో క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యేది. కానీ, ఇప్పుడు యూపీఐ విధానం రావడంతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.
పీఎఫ్ విత్‌డ్రా కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? లాభాలేంటి?
ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు తమ యూపీఐ ఐడీని ఈపీఎఫ్‌వో పోర్టల్‌తో లింక్ చేసుకోవచ్చు. ఇలా లింక్ చేసిన తర్వాత, ఎప్పుడు డబ్బు అవసరమైనా నేరుగా యూపీఐ ద్వారా లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు గమనిస్తే..
- సమయం ఆదా: పీఎఫ్ డబ్బుల కోసం ఇకపై వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
- పేపర్‌వర్క్ ఉండదు: ఫారాలు నింపడం, పత్రాలు సమర్పించడం వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.
- పారదర్శకత: డబ్బు నేరుగా ఉద్యోగి ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
- భద్రత: యూపీఐ ఆధారిత లావాదేవీలు సురక్షితంగా ఉండటమే కాకుండా, వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు.
అకస్మాత్తుగా వచ్చే మెడికల్ ఖర్చులు, పిల్లల చదువు ఫీజులు లేదా ఇంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బుపై ఆధారపడే వారికి ఈ విధానం వరంగా మారనుంది. యూపీఐ ద్వారా తక్షణమే డబ్బు తీసుకునే వెసులుబాటు ఉద్యోగులను ఆర్థికంగా మరింత స్వావలంబన దిశగా నడిపిస్తుంది.
పీఎఫ్ విత్‌డ్రా : ఆర్‌బీఐ లిమిట్స్ భద్రతా ప్రమాణాలు
యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన పరిమితులు పీఎఫ్ విత్‌డ్రాకు కూడా వర్తిస్తాయి. దీని ప్రకారం:
- సాధారణ అవసరాలకు రోజుకు రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- వైద్య ఖర్చులు, విద్య, ఐపీవో (IPO) వంటి ప్రత్యేక అవసరాలకు రూ. 5 లక్షల వరకు పరిమితి ఉంటుంది.
దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ పరిమితులు విధించారు. ఇది డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఒక భాగం. దీనివల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, "పేపర్‌వర్క్ గందరగోళం ఇక ఉండదు. పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం సులభం అవుతుంది" అని పేర్కొన్నారు. దీనివల్ల క్లెయిమ్ రిజెక్షన్లు తగ్గి, పారదర్శకత పెరుగుతుందని ఆయన తెలిపారు.
పీఎఫ్ కొత్త విత్‌డ్రా రూల్స్: మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట
మధ్యతరగతి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అనేది అతిపెద్ద పొదుపు మార్గం. అత్యవసర పరిస్థితులు, పెళ్లిళ్లు, చదువుల కోసం వారు దీనిపైనే ఆధారపడతారు. ఇప్పుడు కొత్త విధానం వల్ల ఏటా జరిగే కోట్ల సంఖ్యలో క్లెయిమ్‌ల పరిష్కారం సులభం కానుంది.
ఉద్యోగులు ముందుగా చిన్న మొత్తాలతో విత్‌డ్రా చేసుకుని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి పెద్ద మొత్తాలకు మారవచ్చు. దీనికోసం ఈపీఎఫ్‌వో యాప్‌లో యూపీఐ లింక్ చేయడం, కేవైసీ (KYC) వివరాలు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ఈ సంస్కరణ పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతా వలే లిక్విడ్ గా మారుస్తుందని, తద్వారా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

