Elon Musk : క్రియేటర్లకు పండగే.. భారీగా డబ్బులు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ !
YouTube vs X : కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ కంటే ఎక్కువ చెల్లిస్తామని ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు. అయితే ఫ్రాడ్ జరగకుండా కఠిన చర్యలు ఉంటాయని, కొత్త విధానం తెస్తున్నట్లు స్పష్టం చేశారు.

యూట్యూబ్ ఆధిపత్యానికి చెక్ పెట్టనున్న మస్క్? ఆ కొత్త ప్లాన్ ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో వీడియో కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మస్క్ సంకేతాలిచ్చారు.
ఈ మేరకు ఆయన చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ భారీ చెల్లింపులు పొందాలంటే క్రియేటర్లు సిస్టమ్‌ను మోసం చేయకూడదని, నిజాయితీగా ఉండాలని మస్క్ కండిషన్ పెట్టారు.
ఒక యూజర్ సలహాతో మొదలైన చర్చ
నిజానికి ఈ చర్చ అంతా ఎక్స్‌లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్‌తో ప్రారంభమైంది. ఆ నెటిజన్ తన పోస్ట్‌లో రాస్తూ.. "ఒకవేళ నేను గనక ఎక్స్ సంస్థలో లేదా ఎలాన్ మస్క్ స్థానంలో ఉంటే, క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్‌ను భారీగా పెంచేవాడిని. బహుశా యూట్యూబ్ కంటే ఎక్కువే ఇచ్చేవాడిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని వాడేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసలైన, ప్రామాణికమైన కంటెంట్ మిగిలి ఉండాలంటే, క్రియేటర్లకు డబ్బులు చెల్లించే ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే నిలబడతాయి" అని అభిప్రాయపడ్డారు.
ఈ పోస్ట్‌పై ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. "సరే, అలాగే చేద్దాం. కానీ సిస్టమ్‌ను ఎవరూ మోసం చేయకుండా కఠినంగా వ్యవహరిస్తాం" అని మస్క్ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్‌ను ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.
మోసాలను అరికట్టడానికి కొత్త టెక్నాలజీ
మస్క్ ఆదేశాలపై ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ కూడా అంతే వేగంగా స్పందించారు. మేము దీనిపైనే పని చేస్తున్నాం అని బదులిచ్చారు. అంతేకాకుండా, ప్లాట్‌ఫారమ్‌లో జరిగే ఫ్రాడ్‌ను అరికట్టడానికి తమ వద్ద ఒక కొత్త పద్ధతి ఉందని ఆయన వెల్లడించారు.
తమ వద్ద ఉన్న కొత్త పద్ధతి ద్వారా 99 శాతం ఫ్రాడ్‌ను తుడిచిపెట్టేయవచ్చు అని బియర్ ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల నకిలీ వ్యూస్, బాట్స్ ద్వారా ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకునే వారి ఆటలు ఇక సాగవని పరోక్షంగా హెచ్చరించారు. కేవలం నిజమైన కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ పెరిగిన ఆదాయం దక్కేలా చూస్తామని ఎక్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
క్రియేటర్ల నుంచి అనూహ్య స్పందన
ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనపై ఆన్‌లైన్ ప్రపంచం, ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నిక్ షిర్లీ దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. నిక్ షిర్లీ ఇటీవల మిన్నెసోటాలోని ఒక డేకేర్ సెంటర్ ఫ్రాడ్‌ను బయటపెట్టి వార్తల్లో నిలిచారు.
"ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇప్పటివరకు యూట్యూబ్ యాడ్సెన్స్‌తో (Adsense) పోటీపడటంలో ఎక్స్ వెనుకబడి ఉంది. కానీ వీడియోలు షేర్ చేయడానికి, సెన్సార్‌షిప్ లేకుండా ప్రజలకు నిజాలు తెలియజేయడానికి ఎక్స్ చాలా శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్" అని షిర్లీ పేర్కొన్నారు.
అంతేకాకుండా, తాను తన స్నేహితులను ఎక్స్‌లో పోస్ట్ చేయమని ఎప్పటి నుంచో కోరుతున్నానని, కానీ ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉండటం వల్ల వారు ఆసక్తి చూపలేదని తెలిపారు. ఇప్పుడు మస్క్ నిర్ణయంతో ఆ పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గేమ్ ఛేంజర్ కానుందా?
మస్క్ నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలియని పరిస్థితి నెలకొంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మనిషి సృష్టించిన ఒరిజినల్ కంటెంట్‌కు విలువ ఇవ్వడం, వారికి తగిన పారితోషికం ఇవ్వడం ద్వారా మాత్రమే విశ్వసనీయమైన సమాచారాన్ని కాపాడుకోగలమని నిపుణులు అంటున్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించే ప్లాట్‌ఫారమ్ వైపే క్రియేటర్లు మొగ్గు చూపుతారని వారు విశ్లేషిస్తున్నారు.
గతంలోనూ తప్పు ఒప్పుకున్న మస్క్
గతంలో కూడా ఎక్స్ ప్లాట్‌ఫారమ్ క్రియేటర్లకు తక్కువ చెల్లిస్తోందని ఎలాన్ మస్క్ అంగీకరించారు. అక్టోబర్‌లో నికితా బియర్ చేసిన ఒక ట్వీట్‌కు స్పందిస్తూ.. "సమస్య ఏంటంటే, మనం క్రియేటర్లకు తక్కువ చెల్లిస్తున్నాం. అలాగే పేమెంట్స్ కేటాయింపు కూడా పెద్దగా జరగడం లేదు" అని మస్క్ పేర్కొన్నారు.
గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ ఈ విషయంలో తమకంటే మెరుగ్గా పని చేస్తోందని ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకుని, యూట్యూబ్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు మస్క్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇది అమలైతే డిజిటల్ కంటెంట్ రంగంలో పెను మార్పులు రావడం ఖాయం.

