- Home
- Business
- Driverless Metro Rail: ఇండియాలో డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే మెట్రో రైలు.. ఎక్కడో తెలుసా? పూర్తి వివరాలు ఇవే
Driverless Metro Rail: ఇండియాలో డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే మెట్రో రైలు.. ఎక్కడో తెలుసా? పూర్తి వివరాలు ఇవే
Driverless Metro Rail: ఇండియాలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు వచ్చేసింది. హిటాచీ రైల్ డ్రైవర్‌లెస్ సీబీటీసీ సిగ్నలింగ్ సాంకేతికతతో చెన్నై మెట్రో ఫేజ్ 2 మొదటి విభాగం ప్రారంభమైంది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియాలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు సేవలు
డ్రైవర్ అవసరం లేకుండానే దానంతట అదే నడిచే అత్యాధునిక మెట్రో రైలు మన భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు రాజధాని చెన్నైకి ఈ హైటెక్ రవాణా వ్యవస్థ వచ్చింది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్‌లో భాగంగా సిద్ధమైన మొదటి ఆపరేషనల్ సెక్షన్‌ను అక్టోబర్ 11న అధికారికంగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పూనమల్లీ నుండి వడపళని వరకు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల కారిడార్‌లో ఈ డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్ల సేవలు షురూ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో కలిసి ఈ నయా కారిడార్‌ను ప్రారంభించారు.
హిటాచీ రైల్ డ్రైవర్‌లెస్ టెక్నాలజీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ గ్లోబల్ సంస్థ 'హిటాచీ రైల్' సిగ్నలింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హిటాచీ రైల్ సంస్థ అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్-బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (CBTC) సిస్టమ్ ద్వారా గ్రేడ్ ఆఫ్ ఆటోమేషన్ 4 (GoA4) లెవెల్ డ్రైవర్‌లెస్ ఆపరేషన్లు సాధ్యమవుతున్నాయి.
అంటే ఈ సిస్టమ్ సహాయంతో రైలు మానవ ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటిక్‌గా నడుస్తుంది. నగరం అంతటా రవాణా కనెక్టివిటీని పెంచడం, నిర్వహణ వేగాన్ని పెంచడం, పర్యావరణ రహిత ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
రూ. 1,620 కోట్ల బిగ్ ప్రాజెక్ట్
2023 సంవత్సరంలో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) నుండి హిటాచీ రైల్ సంస్థ రూ. 1,620 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. మొత్తం 119 కిలోమీటర్ల పరిధిలోని మెట్రో లైన్లకు సిగ్నలింగ్, ట్రెయిన్ కంట్రోల్, వీడియో మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను డిజైన్ చేయడం, తయారు చేయడం, సరఫరా చేయడం, టెస్టింగ్, కమిషనింగ్ బాధ్యతలను ఈ కాంట్రాక్ట్ కింద హిటాచీ చేపట్టింది. భారతీయ మెట్రో రవాణా రంగంలో అందించిన అతిపెద్ద సిగ్నలింగ్ ఒప్పందాలలో ఇది ఒకటిగా నిలిచింది.
ప్రతి 90 సెకన్లకో మెట్రో సర్వీస్
ఈ కొత్త సీబీటీసీ సిస్టమ్ రైలు వేగాన్ని, బ్రేకింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తూ నియంత్రిస్తుంది. ఆటోమేటిక్ ట్రెయిన్ ఆపరేషన్ టెక్నాలజీ వల్ల రద్దీ సమయంలో ప్రతి 90 సెకన్ల చిన్న వ్యవధిలోనే రైళ్లను నడిపే వెసులుబాటు లభిస్తుంది. డ్రైవర్ లేకుండానే ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, నమ్మకమైన ప్రయాణ అనుభూతిని ఈ టెక్నాలజీ అందిస్తుంది.
డబుల్ డెక్కర్ స్ట్రక్చర్.. ప్రయోజనాలు ఇవే
తాజాగా ప్రారంభమైన 15 కిలోమీటర్ల పూనమల్లీ-వడపళని కారిడార్‌లో 11 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. విశేషమేమిటంటే, ఈ మార్గంలో 3.7 కిలోమీటర్ల పొడవైన డబుల్ డెక్కర్ నిర్మాణం ఉంది. ఇది చెన్నై పశ్చిమ శివారు ప్రాంతాలను నగర కేంద్రంతో నేరుగా కలుపుతుంది. దీనివల్ల నిత్యం ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.
హిటాచీ రైల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కృష్ణప్ప మాట్లాడుతూ.. "చెన్నై మెట్రో ఫేజ్ 2 మొదటి సెక్షన్ ప్రారంభం కావడం మాకు గర్వకారణం. మా GoA4 సీబీటీసీ సిస్టమ్ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తూ, నగర ఆర్థిక వృద్ధికి, పర్యావరణ అనుకూల రవాణాకు ఎంతగానో తోడ్పడుతుంది" అని పేర్కొన్నారు.

