- Home
- Business
- Funeral Pre Booking Startup: ఇదెక్కడి వింతరా నాయనా.. బతికుండగానే సొంత అంత్యక్రియలకు బుకింగ్ !
Funeral Pre Booking Startup: ఇదెక్కడి వింతరా నాయనా.. బతికుండగానే సొంత అంత్యక్రియలకు బుకింగ్ !
Funeral Pre Booking Startup: ఢిల్లీకి చెందిన మోక్ష వాయేజ్ అనే స్టార్టప్ కంపెనీ బతికుండగానే సొంత అంత్యక్రియలను ప్రీ బుక్ చేసుకునే వినూత్న సేవలను తెచ్చింది. రూ. 6,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇదెక్కడి బిజినెస్ భయ్యా.. మీ అంత్యక్రియలను మీరే ముందే బుక్ చేసుకోవచ్చు
సాధారణంగా మనం పెళ్లిళ్లు, వెకేషన్ ట్రిప్పుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. కానీ ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ మాత్రం ఎవరూ ఊహించని వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. మనుషులు తాము బతికుండగానే తమ సొంత అంత్యక్రియలను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
మోక్ష వాయేజ్ (Moksh Voyage) పేరుతో ఈ సంస్థ అంతిమ సంస్కారాల ప్లానింగ్ సేవలను అందిస్తోంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంటుంది. అలాంటి సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకోవడం వారికి కష్టమవుతుంది. ఆ బాధ్యతను తగ్గించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఈ స్టార్టప్ చెబుతోంది.
మోక్ష వాయేజ్ ఏమేం సేవలు అందిస్తుంది?
నమో గంగే వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ మోక్ష వాయేజ్ స్టార్టప్ నడుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే అంతిమ సంస్కారాలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను వీరు చూసుకుంటారు. మృతదేహాన్ని మోయడానికి నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి వాహనం సమకూర్చడం ఇందులో ఉంటాయి.
అంతేకాకుండా దహన సంస్కారాలకు అవసరమైన కట్టెలు, పూలు, ఇతర పూజా సామగ్రిని కూడా వీరే అందిస్తారు. పూజారిని పిలిపించడం నుంచి దహన క్రియల వరకు అన్ని పనులను ఈ సంస్థే దగ్గరుండి పూర్తి చేస్తుంది.
అస్థికల నిమజ్జనం, శ్రాద్ధ కర్మలకు కూడా సహాయం
ఈ స్టార్టప్ సేవలు కేవలం దహన సంస్కారాలతోనే ఆగిపోవు. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు కూడా వీరు పూర్తి సహాయం అందిస్తారు. చితాభస్మం సేకరించడం, వాటిని నదిలో నిమజ్జనం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అలాగే శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అవసరమైన ఘాట్, పడవ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వేర్వేరు పనుల కోసం కుటుంబ సభ్యులు వేర్వేరు వ్యక్తుల చుట్టూ తిరగకుండా, అన్నీ ఒకే చోట దొరికేలా ఈ సేవలను రూపొందించారు.
ప్యాకేజీ ధరలు ఎంత ఉంటాయి?
కంపెనీ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ అంత్యక్రియల ప్యాకేజీల ధర సుమారు రూ. 6,000 నుంచి ప్రారంభమవుతుంది. ఎంచుకునే సేవలను బట్టి గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ప్యాకేజీలో అత్యవసరమైన దహన సంస్కారాల ఏర్పాట్లు మాత్రమే ఉంటాయి. ఎక్కువ ధర ఉన్న ప్యాకేజీలలో అదనపు పూజలు, అస్థికల నిమజ్జనం, శ్రాద్ధ కర్మల వంటి పూర్తి స్థాయి సేవలు కవర్ అవుతాయి. అన్నింటికీ ఒకే ఫిక్స్డ్ ధర కాకుండా, కుటుంబం లేదా వ్యక్తి ఎంచుకునే అవసరాలను బట్టి ఛార్జీలు మారుతుంటాయి.
ట్రేడ్ ఫెయిర్‌లో హాట్ టాపిక్.. 300 మందికి పైగా రిజిస్ట్రేషన్
ఈ స్టార్టప్‌లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ ప్రీ బుకింగ్. ఒంటరిగా ఉండే వృద్ధులు లేదా తమ చివరి కోరికలను ముందే నిర్ణయించుకోవాలనుకునే వారు బతికుండగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు దేశంలోని మరికొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఈ సంస్థ ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రేడ్ ఫెయిర్ సమయంలోనే 300 మందికి పైగా ఈ సేవ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కష్టసమయంలో కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని సంస్థ చెబుతుండగా, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని మంచి ఆలోచన అంటుంటే, మరికొందరు చావును కూడా వ్యాపారంగా మార్చారని విమర్శిస్తున్నారు.













