- Home
- Business
- అప్పుల ఊబిలో లక్షలాది మంది.. తెలుగు వారి పరిస్థితి మరీ దారుణం. అసలేందుకిలా జరుగుతోంది
అప్పుల ఊబిలో లక్షలాది మంది.. తెలుగు వారి పరిస్థితి మరీ దారుణం. అసలేందుకిలా జరుగుతోంది
Debt: అప్పు అతిపెద్ద ముప్పు అని చెబుతుంటారు. ఆర్థిక క్రమ శిక్షణ లేకపోతే అప్పులు ఎక్కువుతాయని తెలిసిందే. ఇప్పుడు దేశంలో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో వ్యక్తులు తీసుకునే అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో ఈ అప్పుల శాతం భారీగా పెరిగింది. వీటిలో సగానికి పైగా ‘హౌసింగ్’ లోన్‌కి సంబంధం లేనివే ఉండడం గమనార్హం. అంటే ఎక్కువగా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, వినియోగ అవసరాల కోసం తీసుకునే రుణాలు ఉన్నాయి. దీంతో కుటుంబాలు ఆస్తులు కొనడానికి కాకుండా ఖర్చులను నెత్తిపై మోసుకునేందుకు అప్పు తీసుకుంటున్నాయన్నది స్పష్టమవుతోంది. అదే సమయంలో, ఆదాయానికి మించి లోన్–టు–వాల్యూ రుణాలు పెరగడంతో డిఫాల్ట్ ప్రమాదం కూడా పెరుగుతోంది.
ఏపీ–తెలంగాణలో అప్పుల భారమే ఎక్కువ
ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 7 మంది పెద్దల్లో ఒకరికి అప్పు ఉంది. కానీ, దక్షిణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ – 43.7% మంది అప్పులో ఉండగా..
తెలంగాణ – 37.2% మంది అప్పులో ఉన్నారు.
ఇక కేరళ, తమిళనాడు విషయానికొస్తే – దాదాపు 30% మంది అప్పుల ఊబిలో ఇరుక్కున్నారు. కాగా ఢిల్లీలో కేవలం 3 నుంచి 4 శాతం మంది మాత్రమే అప్పులతో బాధపడుతున్నారు. అంటే, ఏపీ, తెలంగాణలో దాదాపు ప్రతి రెండో కుటుంబం అప్పుతో జీవిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగాయి
పది సంవత్సరాల్లో రాష్ట్రాల అప్పులు రూ. 17.5 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 60 లక్షల కోట్లకు పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి పనుల కోసం అప్పు తీసుకుంటున్నా, చాలా రాష్ట్రాలు రోజువారీ ఖర్చులకే రుణాలు తీసుకునే స్థితికి వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఆ రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెంచుతుంది.
ఆందోళనకరంగా పరిస్థితి
అప్పు ఒక సంఖ్య కాదు.. అది కుటుంబాల కష్టాలు, ఖర్చుల భారాన్ని సూచిస్తుంది. నెల చివరిలో ఖర్చులు తీరక అప్పులు పెరగడం, యువత సెక్యూరిటీ లేని రుణాల్లో చిక్కుకోవడం, రాష్ట్రాల బడ్జెట్‌పై భారమైపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే.. కుటుంబాల పొదుపులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రాలకు అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం తగ్గిపోవడం, ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మరి పరిష్కారం ఏంటి.?
స్పష్టమైన అవగాహనను పెంచుకోవడం ద్వారా అప్పులను తీర్చవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మెరుగైన ఆర్థిక విద్య, మంచి రుణ నియంత్రణ, బాధ్యతతో కూడిన విధాన రూపకల్పన వంటి మార్పులతో రుణాలు తీర్చడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.

