50 మంది మృతికి కారణమైన తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది.. భారీ విపత్తు తప్పదా?
Ditwah cyclone: ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాను దూసుకొస్తుంది. ఇప్పటికే శ్రీలంకలో విలయం సృష్టిస్తున్న ఈ తుపాను ఇప్పుడు ఏపీ వైపు తరుముకొస్తుంది. దీని ప్రభావం ఏయే ప్రాంతాలపై పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలంకలో భారీ నష్టం
దిత్వా తుపాను శ్రీలంకలో పెద్ద విధ్వంసానికి కారణమైంది. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 50 మంది మరణించగా, మరో 25 మంది ఆచూకి తెలియాల్సి ఉంది. తుపాను కారణంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. నదులన్నింటిలోనూ నీటి స్థాయి గణనీయంగా పెరిగింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. పలు పాఠశాలల్నీ మూసివేశారు.
రవాణా సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి
కొలంబో విమానాశ్రయానికి విమానాలు ల్యాండ్ అవ్వడంలో ఇబ్బందులు తలెత్తాయి. అవసరమైతే విమానాలను తిరువనంతపురం లేదా కొచ్చి వైపు మళ్లించాలని నిర్ణయించారు. జాతీయ ఉద్యానవనాలను మూసేశారు. అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. ఉదయం 6 గంటల నుండే రైలు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్ర తీరాలకు అలర్ట్
ఈ తుపాను బలపడడం వల్ల తమిళనాడు–ఆంధ్ర–పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఆందోళన పెరిగింది. తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నైలోని నీటి ప్రాజెక్టుల నుంచి ముందస్తు జాగ్రత్తగా నీటిని విడుదల చేస్తున్నారు. రెడ్ హిల్స్, పొంటి, చెంబరంబాక్కం ప్రదేశాల నుంచి నీరు వదులుతున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఆంధ్ర తీరానికి ముప్పు – వాతావరణ శాఖ హెచ్చరిక
తుపాను కారణంగా బలమైన గాలులు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సహజ ప్రమాద సూచనలు విడుదల చేసింది. నెల్లూరు, బాపట్ల వైపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలల ఎగిసిపడడం వల్ల మత్స్యకారులకు అత్యంత ప్రమాదం. తీర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాలకు ఎక్కువ ప్రభావం
నెల్లూరు, తుప్పల, బాపట్ల, ఒంగోలు తీర మండలాలు మొదట ప్రభావితమయ్యే ప్రాంతాలుగా చెబుతున్నారు. వర్షపాతం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. తీర రహదారులు, లోతట్టు ప్రదేశాలు నీటితో నిండే అవకాశం ఎక్కువగా ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. చిన్న పడవలు, లంగరింగ్ ప్రాంతాల్లో ఉన్న చేపల పడవలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

