- Home
- Business
- Silver Price : సిల్వర్ వార్.. బంగారాన్ని దాటేసిన వెండి.. కిలో రూ. 2.7 లక్షలు, చైనా పనేనా?
Silver Price : సిల్వర్ వార్.. బంగారాన్ని దాటేసిన వెండి.. కిలో రూ. 2.7 లక్షలు, చైనా పనేనా?
Silver Price : చైనా కొత్త లైసెన్స్ విధానంతో వెండి సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. కిలో వెండి ధర రూ. 2.7 లక్షలకు చేరగా, 2025లో భారత్ సుమారు రూ. 78,200 కోట్ల ($9.2 బిలియన్లు) రికార్డు దిగుమతులు నమోదు చేసింది. మరింతగా వెండి ధరలు పెరిగే అవకాశముంది.

సిల్వర్ వార్: చైనా కొత్త రూల్, భారత్‌కు గట్టి దెబ్బ
గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వెండి సంక్షోభం (Silver Crisis) గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన వెండి ధరలు, రాబోయే రోజుల్లో సరఫరా లోపం కారణంగా మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2025 సంవత్సరంలో అత్యధికంగా ధరలు పెరిగిన కమోడిటీల జాబితాలో వెండి ముందు వరుసలో ఉంది.
భారతదేశంలో కేవలం ఒక్క ఏడాదిలోనే వెండి ధర దాదాపు మూడు రెట్లు పెరగడం గమనార్హం. వెనిజులాలో అమెరికా సైనిక చర్యల తర్వాత పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒక కారణం కాగా, చైనా తీసుకున్న కొత్త నిర్ణయం మరొక ప్రధాన కారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యధికంగా వెండి ప్రాసెసింగ్ చేసే చైనా, ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ లైసెన్స్ విధానాన్ని తెరపైకి తెచ్చింది.
వెండి ధరల పెరుగుదల.. భారత దిగుమతులు
కొత్త పరిణామాల నేపథ్యంలో, జనవరి 2026 ప్రారంభంలో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 2.4 లక్షల నుంచి రూ. 2.7 లక్షల స్థాయికి చేరుకుంది. అదే జనవరి 2025లో దీని ధర కిలోకు రూ. 80,000 నుంచి రూ. 85,000 మధ్య ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే ధర మూడు రెట్లు పెరిగింది.
భారత్‌లో వెండికి డిమాండ్ పెరగడంతో దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2025లో భారత్ ఏకంగా 9.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 78,200 కోట్ల) విలువైన వెండిని దిగుమతి చేసుకుంది, ఇది గత ఏడాదితో పోలిస్తే 44 శాతం ఎక్కువ. ప్రపంచంలో శుద్ధి చేసిన వెండి వాణిజ్యంలో 21.4 శాతం వాటాతో భారత్ ఇప్పుడు గ్లోబల్ సిల్వర్ వార్ లో కీలక కేంద్రంగా మారింది. అమెరికా 2025 లోనే వెండిని అధికారికంగా క్రిటికల్ మినరల్ అంటే కీలక ఖనిజంగా గుర్తించింది.
పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ లో వెండికి డిమాండ్
ప్రస్తుతం వెండి ప్రాముఖ్యత ఆభరణాలు, పాత్రలకే పరిమితం కాలేదు. దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత పరిశ్రమల నుండి వస్తోంది. వెండి విద్యుత్, ఉష్ణాన్ని అద్భుతంగా ప్రసారం చేస్తుంది. అందుకే ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ బోర్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు, ఆటోమొబైల్ పరిశ్రమలకు ఇది అత్యవసర లోహంగా మారింది.
ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ లేదా హరిత ఇంధన రంగంలో వెండి పాత్ర కీలకం. సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తయారీలో వెండిని కండక్టివ్ పేస్ట్‌గా వాడతారు. ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్‌లో 15 శాతం కేవలం సౌర విద్యుత్ రంగం నుండే వస్తోంది. అలాగే వైద్య రంగంలో యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల గాయాల డ్రెస్సింగ్, మెడికల్ పరికరాలు, నీటి శుద్ధి వ్యవస్థల్లో దీని వాడకం పెరిగింది. ప్రపంచ వెండి డిమాండ్‌లో దాదాపు 55-60 శాతం పారిశ్రామిక అవసరాలదే కావడం గమనార్హం.
వెండి సరఫరా లోటు, మైనింగ్ సవాళ్లు
గత ఐదేళ్లుగా వెండి డిమాండ్, సరఫరా కంటే ఎక్కువగా ఉంది. ఈ లోటు ఏటా 20 నుండి 25 కోట్ల ఔన్సుల వరకు ఉంటోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి సరఫరా 813 మిలియన్ ఔన్సులుగా స్థిరంగా ఉంటుందని ది సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది.
వెండి సరఫరాను తక్షణమే పెంచడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచంలో వెలికితీసే వెండిలో కేవలం 25 శాతం మాత్రమే నేరుగా వెండి గనుల నుండి వస్తుంది. మిగిలిన 70 శాతానికి పైగా వెండి రాగి, సీసం, జింక్ మైనింగ్‌లో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. కొత్త గనులను ప్రారంభించడానికి 15 నుండి 25 ఏళ్లు పడుతుంది. ఈ కారణంగా వచ్చే 10-15 ఏళ్ల వరకు వెండి కొరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనా కొత్త నిబంధనలు.. వెండి సరఫరాపై ప్రభావం
జనవరి 1, 2026 నుండి చైనా వెండి ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. దీనిని లైసెన్స్ ఆధారిత వ్యవస్థగా మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు మాత్రమే వెండిని ఎగుమతి చేయగలవు. ప్రతి ఎగుమతికి ప్రభుత్వం నుండి ఆమోదం తప్పనిసరి.
ఇది పూర్తిగా నిషేధం కాకపోయినప్పటికీ, ఈ చర్య ప్రపంచ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ప్రాసెసర్. ప్రపంచ వెండి ముడిసరుకు దిగుమతుల్లో 90 శాతం చైనాకే వెళ్తోంది. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితిని పెంచింది.
వెండి ధరలు.. భారత్ వ్యూహం మారాలి
ప్రపంచంలో శుద్ధి చేసిన వెండిని అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు రూ. 41,055 కోట్ల ($4.83 బిలియన్లు) విలువైన వెండిని దిగుమతి చేసుకోగా, కేవలం రూ. 4,066 కోట్ల ($47.84 కోట్ల డాలర్లు) విలువైన వెండి ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసింది. మనం ఎక్కువగా హాంకాంగ్ (38.4%), ఇంగ్లాండ్ (31.7%) నుండి వెండిని కొనుగోలు చేస్తున్నాం.
భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాలి. కేవలం వెండిని ఒక విలువైన లోహంగా చూడకుండా, పారిశ్రామిక, ఇంధన పరివర్తనకు కీలకమైన లోహంగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో మైనింగ్ భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, దేశీయంగా రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం, దిగుమతి వనరులను విస్తరించుకోవడం ఇప్పుడు అత్యవసరం. వెండి భద్రత అనేది ఇప్పుడు ఇంధన భద్రతతో సమానంగా మారిందని నిపుణులు సూచిస్తున్నారు.

